క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై మాజీమంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం, పాలనను గాలికొదిలేసి, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శించిన బొత్స.. యూట్యూబ్ జర్నలిస్టులు రావణ్, కేవీ రెడ్డి అరెస్టులే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వస్తే రిసీవ్ చేసుకునేందుకు కూడా చంద్రబాబుకు తీరిక దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.?లేదా ? అని ప్రశ్నించిన బొత్స.. ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన స్థితిలో ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతసేపూ రావణ్, కేవీ రెడ్డి వంటి యూట్యూబర్లు, జర్నలిస్టులపై కక్ష సాధింపులకే పరిమితం అవుతోందని, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా, లాకప్ డెత్ లు జరుగుతున్నా, ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలతో జనం నరకం అనుభవిస్తున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతుల పంటకూ గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారనీ, యూరియా దొరకని పరిస్ధితులు ఉన్నాయనీ విమర్శించారు. ఇవన్నీ వదిలేసి ప్రశ్నించే వ్యక్తుల్ని టార్గెట్ చేసే పనిలో ఉన్నారనీ, తనకు హోంమంత్రి ఇస్తే నీ సంగతి తేల్చేస్తా అని ఒకరు అంటుంటే, అసలు హోంమంత్రి తనను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తుంటే, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రంలో పర్యటనలకే పరిమితం అవుతున్నారు అని ఆరోపించారు. జరిగిపోయిన వాటికే మళ్లీ మళ్లీ శంఖుస్ధాపనలు, భూమి పూజలు చేసుకుంటున్నారన్న బొత్స.. ప్రజల సమస్యల్ని మాత్రం గాలికొదిలేశారనీ ఎద్దేవా చేశారు.
వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం..
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకుల మీద ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతోందన్న బొత్స.. ఈ రెండున్నరేళ్లలో మూడు లక్షల కోట్లకుపైగా అప్పులు తెచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు తెచ్చిన అప్పులతో ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పెన్షన్ పెంపు మినహా మరే కొత్త పథకం అమలు చేయలేదని, ఈ డబ్బంతా ఎటు పోయిందో తెలియడం లేదన్నారు. మహిళల్ని బస్సులు ఎక్కించిన మీరు.. సున్నా వడ్డీలు మాత్రం ఎగ్గొట్టారని విమర్శించారు. కేంద్ర విద్యామంత్రి స్కూళ్లకు వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ లు చూసి ప్రశంసించారంటే కారణం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలేనని.. కూటమి ప్రభుత్వం విద్యార్దులకు ఇంకా స్కూల్ కిట్లే ఇవ్వలేదనీ విమర్శించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందనీ, మావిగనే మా విధానమని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తన స్థలంలో వైఎస్సార్సీపీ ఆఫీసు కట్టారని రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గవర్నర్ పదవే ఆయనకు చివరిదనీ, రాజ్యాంగ పదవిలో ఉంటూ గౌరవం ఎందుకు తగ్గించుకుంటున్నారనీ ప్రశ్నించారు.
మరో పర్యాటక అద్భుతానికి సిద్ధమవుతున్న హైదరాబాద్.. బుద్ధుడి చుట్టూ స్కైవాక్ ప్లాన్!