-
తెలంగాణలో అధికారమే ధ్యేయం..
-
4న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన
-
బెంగాల్ ఫార్ములా మాదిరిగా ప్రయోగాలు
-
భారీగా పార్టీలో చేరికలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పై బిజెపి ప్రత్యేక గురి పెట్టింది. ఇక్కడ నుంచి కార్యక్రమాలను వేగవంతం చేయాలని చూస్తోంది. ప్రధానంగా హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక ఫోకస్ చేయడంతో తెలంగాణలో సమీకరణలు ఒక్కసారిగా మారనున్నాయి. ఈనెల 4న తెలంగాణలో పర్యటిస్తున్నారు అమిత్ షా. ఇప్పటివరకు పార్టీ వర్గాల ద్వారా వచ్చిన సమాచారంతో కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు అమిత్ షా. మరోవైపు వరుసగా కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీనిని ఒక నిరంతర కార్యక్రమం గా కొనసాగించాలని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. ఇకనుంచి తెలంగాణపై సర్వశక్తులు ఒడ్డాలి అనేది బిజెపి పెద్దల ఆలోచన.
-
బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత..
పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బిజెపి అగ్ర నేతలు.. తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అని ప్రకటించారు. అన్నట్టుగానే ప్రధాని నరేంద్ర మోడీ భాగ్యనగరంలో పదివేల కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవాలు కూడా చేశారు.
అయితే అటు తరువాత బిజెపి కార్యకలాపాలు పెద్దగా జరగలేదు. పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ కాలేదు. ఒక రకమైన స్తబ్దు వాతావరణం కొనసాగింది. ఈ తరుణంలో పార్టీ హైకమాండ్ మరింత వేగంగా అడుగులు వేయాలని భావించింది.
ముఖ్యంగా అమిత్ షా రంగంలోకి దిగి ఇక్కడ పార్టీ శ్రేణులను మరింత యాక్టివ్ చేయనున్నారు. నేతలను ఏకతాటిపైకి తెచ్చి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలని దిశా నిర్దేశం చేయనున్నారు.
-
విభేదాల పర్వం పై దృష్టి..
వాస్తవానికి మొన్న ఆ మధ్యన బీజేపీ అగ్ర నేతలు కొందరు రంగంలోకి దిగారు. కీలక నేతలు వచ్చి బిజెపి నాయకుల మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బెంగాల్లో అనుసరించిన ఫార్ములానే ఇక్కడ కూడా అప్లై చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా భారీగా చేరికలు పెంచాలని చూస్తున్నారు.
గులాబీ పార్టీలోని అసంతృప్తులను, కాంగ్రెస్ పార్టీపై విరక్తితో ఉన్న నాయకులను కమలం వైపు లాగేలా వ్యూహరచన చేయనున్నారు. ఇక్కడి నుంచి 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు వరుస కార్యక్రమాలు కొనసాగించాలని బిజెపి అగ్ర నేతలు నిర్ణయించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో తెలంగాణ బిజెపి నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
