-
పార్టీ కోఆర్డినేటర్ల సమావేశానికి గైర్హాజరు
-
తాడేపల్లి వైపు రాని మాజీమంత్రి
-
జగన్ దూరం పెట్టారా? ఆయనే దూరం జరిగారా?
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? ఉంటే కనిపించరు ఎందుకు? మిగతా నేతలు యాక్టివ్ అయినా ఆయన ఎందుకు కావడం లేదు? జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు ఇవ్వలేదా? లేకుంటే కేసులకు భయపడి ఆయన బయటకు రావడం లేదా? పొలిటికల్ సర్కిల్స్లో ఇదే ఆసక్తికర చర్చ.
దాదాపు నేతలంతా హాజరు..
ఇటీవల జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి దాదాపు వైసీపీ నేతలు అంతా హాజరయ్యారు. చివరకు అనారోగ్యంతో బాధపడుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లాంటి నేతలు కూడా వచ్చారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అయితే అందరూ కనిపించారు కానీ.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆయన ఎందుకు హాజరు కావడం లేదన్న అంశంపై సొంత పార్టీ నేతలే చర్చించుకున్నారు. జగన్ దూరం పెట్టారా? లేకుంటే ఆయనే దూరం జరిగారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఫైర్ బ్రాండ్ ముద్ర..
వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదువ లేదు. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ మోహన్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్.. ఇలా అంతా యాక్టివ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కానీ మొన్నటి కోఆర్డినేటర్ల సమావేశానికి అంతా హాజరయ్యారు.
కానీ అనిల్ కుమార్ యాదవ్ జాడలేదు. అయితే ఆయనను జగన్ దూరం పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అనిల్ . ఓటమి ఎదురయ్యేసరికి అటువైపుగా చూడడం మానేశారు. అడపాదడపా నెల్లూరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్తుంటారు. గత కొంతకాలంగా అది లేదు.
అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉన్న ఆయనను ఎంపీగా పోటీ చేయించారు. ఓడిపోయిన తర్వాత అనిల్ తిరిగి సిటీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. అందుకు జగన్ అంగీకరించకపోవడంతోనే అనిల్ కుమార్ యాదవ్ మనస్తాపంతో రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం నడుస్తోంది. రాష్ట్రస్థాయి సమావేశాలకు సైతం ఆయన గైర్హాజరవుతుండడంతో అదే నిజం అని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది.. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో?