క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో పలువురు వైద్యులపై ప్రభుత్వం సీరియస్ అయింది. 43 మంది వైద్యులపై చర్యలు తీసుకుంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ సేవలకు దూరంగా ఉంటూ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న 43 మంది వైద్యులను ప్రభుత్వం విధుల నుంచి తాజాగా డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. గరిష్టంగా నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వీరికి నిబంధనలను అనుసరించి సంజాయిషీ నోటీసులు జారీ చేసిన ఆరోగ్యశాఖ.. సదరు వైద్యుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో శాశ్వతంగా విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి సత్య కుమార్ యాదవ్ సదరు వైద్యులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గత నెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధన ఆసుపత్రిలో పనిచేసే వైద్యుల్లో 51 మంది అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది. గత నెలలో వారిని కూడా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి తప్పించారు. అదే విధంగా ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోను పని చేస్తున్న వైద్యులపైనా తాజాగా యాక్షన్ తీసుకుంది. వీరిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనిక్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు ఉన్నట్లు చెబుతున్నారు. వీరంతా కొన్ని నెలల నుంచి విధులకు హాజరు కాకుండా అనధికారికంగా విధులకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. దీనివల్ల రోగులకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ పరిగణంలోకి తీసుకున్న ప్రభుత్వం కొన్ని నెలలుగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులను గుర్తించి వారికి తొలుత నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై వైద్యులు నుంచి స్పందన లేకపోవడంతో ఈ మేరకు ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది. మొత్తంగా 43 మంది వైద్యులను డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాజీనామా సమర్పించిన మరో 34 మంది వైద్యులు..
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 118 మంది పర్మనెంట్ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నట్లు గుర్తించింది. వీరిలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే విధుల నుంచి తప్పించవచ్చు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే 43 మంది వైద్యుల్ని శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియను ప్రారంభించింది ఆరోగ్యశాఖ. ఈ క్రమంలోనే మరో 34 మంది వైద్యులకు నోటీసులు జారీ చేసి అభియోగాలు నమోదు చేసి చేసింది. అయితే 34 మంది వైద్యులు విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపించకపోవడంతో రాజీనామాలు చేశారు. వీరిలో 15 మంది వైద్యుల రాజీనామాలను ప్రభుత్వం తాజాగా ఆమోదించేందుకు సిద్ధమవుతోంది. అభియోగాల నమోదు అనంతరం మిగిలిన 19 మంది రాజీనామాలను ఆమోదించనున్నారు. అయితే, అంతకు ముందు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా జిల్లాల వారీగా 11 మంది విచారణ అధికారులను నియమించారు. వీరు వైద్యుల నుంచి వివరణ కోరి ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అభియోగాలు నమోదు అనంతరం మరో 19 మంది వైద్యులు వ్యక్తిగత కారణాల వల్ల విధులకు హాజరు కాలేదని వివరణ ఇచ్చారు. దీనిపై విచారణ జరగనుంది. అలాగే, మరో 13 మంది వైద్యుల అభ్యర్థనలు ప్రభుత్వ పరిధిలో ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు.