క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఉద్ధవ్ థాక్రే శివసేన (యుబిటి)లో చీలిక వచ్చింది. ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీల్లో ఆరుగురు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీలో కలిసి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. ఈ విన్నపానికి వెంటనే స్పందించిన స్పీకర్ ఓం బిర్లా దానికి ఆమోదం తెలియజేశారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసిన వారిలో సంజయ్ జాదవ్, సంజయ్ దేశముక్, సంజయ్ పాటిల్, నగేష్ పాటిల్, ఓంరాజ్ నిమ్బాల్కర్, బాలా సాహెబ్ వాక్ చౌరే ఉన్నారు. ఈ నెల 19న శివసేన 60 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏక్ నాథ్ షిండే శివసేనలో ఈ వర్గం విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ముంబై రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా యూబీటీకి చెందిన ఎంపీలు చీలి పోతారంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ అప్రమత్తమయ్యారు. తాజాగా ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించి విప్ కూడా జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీలు వెంటనే స్వీకరణ కలిసి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలతో శివసేనలో కలవరం మొదలైంది.
బిల్లులను ఆమోదించడమే లక్ష్యంగా అడుగులు..
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలను లాక్కునే ప్రయత్నాలను చేస్తోంది. తొలుత పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఓటమి సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై ఈ ప్రయోగాన్ని చేసిన బిజెపి.. తాజాగా మహారాష్ట్రలోనూ అదే ఫార్ములాను అనుసరించింది. తృణమూల్ కు చెందిన సుమారు 20 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉండేందుకు సిద్ధమయ్యారు. తాజాగా శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు అదే బాటలో పయనించడంతో లోక్సభలో ఎన్డీఏ బలం భారీగా పెరిగినట్టు అయింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో ప్రధాన పార్టీగా ఉన్న సమాజ్వాదికి చెందిన ఎంపీలను లాక్కునే ప్రయత్నాలను బిజెపి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని మంత్రులే బహిరంగంగా ప్రకటించారు.
ఎస్పీకి చెందిన 37 మంది ఎంపీల్లో 25 మంది చీలిపోయేందుకు రెడీగా ఉన్నారంటూ ఇద్దరు మంత్రులు ప్రకటించారు. ఈ లీకులన్నీ తదుపరి భారతీయ జనతా పార్టీ కార్యాచరణను ప్రతిబింబిస్తాయని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను వచ్చే పార్లమెంటులో ఆమోదించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు పెడుతోంది. తద్వారా తమకు ఎంపీల మద్దతును పెంచుకునే ప్రయత్నాలను బిజెపి చేస్తుంది. ఎంపీలు సంఖ్య పెంచుకునే క్రమంలో బిజెపి విజయం సాధిస్తూనే వస్తుంది. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చే ఎంపీల సంఖ్య 317 కు చేరుకుంది. ఎస్పీ ఎంపీలు కూడా ఇందులో చేరితే ఈ సంఖ్య సుమారు 350కి చేరుతుంది. అప్పుడు కీలక బిల్లులను లోక్సభలో ఆమోదించుకోవడం ఎన్డీఏకు సులభం అవుతుంది. ఇప్పటికే డిఎంకె కూడా బిజెపి పట్ల సానుకూలతను వ్యక్తం చేస్తోంది. ఈ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు తెలియజేస్తే బీజేపీ లక్ష్యం నెరవేరునట్టు అవుతుంది. మరి చూడాలి బిజెపి ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో.