బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజం కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న ఓ సామాజిక కార్యకర్త కృషికి ముగ్ధుడైన ఆయన.. ఏకంగా రూ.21 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రముఖ టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) వేదికగా పరిచయమైన ఈ సేవా కార్యక్రమాలు అమితాబ్‌ను ఎంతగానో కదిలించాయి.
సిమ్లాకు చెందిన సర్బ్‌జీత్ సింగ్ బాబీ ‘ఆల్మైటీ బ్లెస్సింగ్స్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఇటీవల కేబీసీ కార్యక్రమంలో ఆయనకు ‘ఫోర్స్ ఆఫ్ గుడ్’ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా తన సంస్థ ద్వారా చేస్తున్న సేవలను ఆయన వివరించారు. వాటిని విన్న అమితాబ్ బచ్చన్ ఎంతో అభినందించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సర్బ్జీత్కు ప్రశంసా పత్రంతో పాటు రూ.21 లక్షల విరాళాన్ని అందించారు. ఈ సాయం కేబీసీ కార్యక్రమం తరఫున కాకుండా, తన వ్యక్తిగత ఖాతా నుంచి ఇస్తున్నట్లు అమితాబ్ స్పష్టం చేశారు.
రోజూ వేలాది మందికి ఉచిత భోజనం
సర్బ్‌జీత్ సింగ్ బాబీ నేతృత్వంలోని బృందం గత 12 సంవత్సరాలుగా సిమ్లాలోని ఆసుపత్రుల వద్ద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే రోగుల కుటుంబ సభ్యులు, సహాయకులు ఆహారం కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఉచిత భోజన సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ సుమారు 4 వేల మందికి ఆహారం అందిస్తున్నారు.
28 ఏళ్లుగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే కాకుండా, ఎవరూ పట్టించుకోని అనాథ మృతదేహాలకు కూడా ఈ సంస్థ గౌరవప్రదమైన వీడ్కోలు పలుకుతోంది. గత 28 ఏళ్లుగా ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తోంది. వీటితో పాటు రక్తదాన శిబిరాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపడుతూ సమాజానికి అండగా నిలుస్తోంది.
అమితాబ్ బచ్చన్ నుంచి అందిన రూ.21 లక్షల విరాళంపై సర్బ్‌జీత్ సింగ్ బాబీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సాయం తమ సేవలను మరింత విస్తరించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ గుర్తింపు తన ఒక్కడి కృషికి దక్కిన ఫలితం కాదని, తనతో కలిసి పనిచేస్తున్న వాలంటీర్లు, సహకరిస్తున్న దాతలందరి సమష్టి కృషి అని పేర్కొన్నారు. ఓవైపు స్టార్డమ్తో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న అమితాబ్ బచ్చన్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
also read: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. నాలుగు ప్రముఖ హోటళ్ల లైసెన్సులు రద్దు!
