Homeతెలంగాణఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం.. రూ.200 కోట్ల ఆస్తులు!!

ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం.. రూ.200 కోట్ల ఆస్తులు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. గత కొన్ని నెలలుగా అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల నుంచి లంచాల రూపంలో తీసుకుని కూడబెట్టిన రూ. వందల కోట్లను పట్టుకుంటున్నారు. పక్కా సమాచారంతో అవినీతి అధికారుల చిట్టా సేకరించి.. అదును చూసి.. ఏకకాలంలో చాలా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. వారి అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నారు. ఇటీవల పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు.. రూ.వందల కోట్ల అక్రమాస్తులతో ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాజాగా మరో అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో నివసిస్తున్న ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సుంకరి నరహరిపై వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగలు, నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. ఇవాళ ఉదయం నుంచి సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఛత్రినాకలోని సుంకరి నరహరి ఇంటితోపాటు ఆయన కార్యాలయం.. కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు ఇలా మొత్తం 11 ప్రాంతాల్లో ఒకే సమయంలో దాడులు చేశారు. ఈ క్రమంలోనే సుంకరి నరహరి ఇంట్లో.. ఆయన బెడ్రూంలో ఉన్న బెడ్డు కింద రూ.1.10 కోట్ల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన ఇంట్లో దొరికిన బంగారు ఆభరణాలు, డబ్బు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. సుంకరి నరహరితోపాటు.. ఆయన సోదరుడి ఇంట్లో భారీగా ఆస్తిపత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాంతాల్లో ఓపెన్‌ ప్లాట్లతోపాటు.. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు విచారణలో వెల్లడైంది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలోని స్పెషల్ టీమ్స్ ఈ సోదాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు దొరికిన ఆధారాల ప్రకారం.. ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి ఆస్తులు.. రూ.200 కోట్లకు పైనే ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు