భవిష్యత్ రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చే సామర్థ్యంతో కూడిన ఒక విప్లవాత్మక ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. భారత్, యూఏఈ దేశాలు కలిసి అరేబియా సముద్ర గర్భంలో అండర్‌వాటర్ సొరంగ మార్గాన్ని నిర్మించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. “డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్”గా పిలవబడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ముంబై నుంచి దుబాయ్ వరకు ప్రయాణాన్ని కేవలం రెండు గంటలకు కుదించేలా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విమాన ప్రయాణానికి మూడు నుంచి నాలుగు గంటలు పట్టే ఈ దూరాన్ని అత్యాధునిక సాంకేతికతతో అతి వేగంగా పూర్తి చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం.
ఈ సొరంగ మార్గం సుమారు 2000 కిలోమీటర్ల పొడవున ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఇందులో నడిచే రైళ్లు సాధారణ రైళ్లు కాకుండా గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్ లేదా సూపర్‌సోనిక్ సాంకేతికతతో పనిచేస్తాయి. సముద్ర మట్టానికి దాదాపు 200 మీటర్ల లోతులో నిర్మించే ఈ మార్గం ప్రయాణికులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందించనుంది.
ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం పనోరమిక్ గ్లాస్ డిజైన్. రైలు కిటికీలు, గోడలు పారదర్శకంగా ఉండేలా రూపొందించబడతాయి. దీంతో ప్రయాణికులు సముద్ర గర్భంలోని జీవాలను ప్రత్యక్షంగా వీక్షించగలుగుతారు. తిమింగలాలు, షార్క్‌లు, రంగురంగుల చేపలు కళ్ల ముందే కనిపించడం వల్ల ఈ ప్రయాణం ఒక విశాల అక్వేరియంలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ అండర్‌వాటర్ టన్నెల్ కేవలం ప్రయాణికుల రవాణాకే పరిమితం కాదు. యూఏఈ నుంచి భారత్‌కు ముడి చమురును వేగంగా తరలించేందుకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. అదే సమయంలో భారత్ నుంచి దుబాయ్‌కు త్రాగునీటిని సరఫరా చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.
ఈ విధంగా ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక మరియు ఆర్థిక సంబంధాలను మరింత బలపరచే ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 50 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా. నిర్మాణ దశలోనే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. సుమారు 50,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఈ రైలు అందుబాటులోకి వస్తే టికెట్ ధరలు కూడా విమాన ప్రయాణంతో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారత్ మరియు యూఏఈ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి. ప్రస్తుతం సాంకేతిక సాధ్యాసాధ్యాలపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2030 నాటికి ఈ అద్భుత ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చే అవకాశముందని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో సాగే ఈ సూపర్ ఫాస్ట్ ప్రయాణం భవిష్యత్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.
also read: అంతర్జాతీయ వాచ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నోరా ఫతేహి..