హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఇంటి నుంచే పని చేస్తూ మంచి ఆదాయం సంపాదించవచ్చన్న ఆశతో వారు చెప్పినట్లు చేయడంతో ఏకంగా రూ.8.23 లక్షలు నష్టపోయారు. శంషాబాద్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తి ఈ ఆన్లైన్ మోసానికి బాధితుడయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 1న బాధితుడిని టెలిగ్రామ్ ద్వారా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సంప్రదించారు. డగ్లస్ ఎల్లిమాన్ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. తమకు సంబంధించిన కొన్ని టాస్కులు పూర్తి చేస్తే మంచి లాభాలు పొందవచ్చని ఆశ చూపించారు. దీంతో వారి మాటలు నమ్మిన బాధితుడు వారు సూచించిన పనులు చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో టాస్కుల పేరుతో సైబర్ నేరగాళ్లు విడతల వారీగా డబ్బులు చెల్లించాలని కోరారు. లాభాలు వస్తాయన్న నమ్మకంతో బాధితుడు మొత్తం రూ.8,23,751ను వారికి బదిలీ చేశారు. అయితే, మరింత డబ్బు చెల్లించాలంటూ నిందితులు ఒత్తిడి చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ముందుగానే డబ్బులు అడిగినా, టాస్కుల పేరుతో పెట్టుబడులు పెట్టాలని కోరినా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.
also read: వైసీపీ నేత ఇంట్లో భారీగా అక్రమ మద్యం.. 1,341 బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్!
