Homeలైఫ్ స్టైల్ఉదయం అల్పాహారం ఆలస్యమైతే ఆయుష్షుకు ముప్పు.. జాగ్రత్త!

ఉదయం అల్పాహారం ఆలస్యమైతే ఆయుష్షుకు ముప్పు.. జాగ్రత్త!

ఉదయం నిద్రలేవగానే మనం తీసుకునే అల్పాహారం (టిఫిన్) రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, కేవలం ఏం తింటున్నామనేదే కాకుండా, ఏ సమయానికి తింటున్నామనేది కూడా మన ఆరోగ్యాన్ని, ఆయుష్షును నిర్ణయిస్తుందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉదయం టిఫిన్ చేసే సమయానికి, మనిషి ఆయుష్షుకు మధ్య బలమైన సంబంధం ఉందని రీసెర్చర్లు కీలక విషయాలను వెల్లడించారు.

సుమారు 31 వేల మందిపై నిర్వహించిన ఈ విస్తృత స్థాయి సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధకుల అంచనా ప్రకారం, ఉదయం 7:00 గంటల నుండి 8:00 గంటల మధ్య బ్రేక్‌ఫాస్ట్ చేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు మరియు అకాల మరణాల ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. ఉదయాన్నే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియలు సక్రమంగా పనిచేసి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, అల్పాహారం తీసుకునే సమయం ఆలస్యమయ్యే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతున్నాయని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఉదయం 8:00 గంటల నుండి 10:00 గంటల మధ్య టిఫిన్ చేసే వారిలో అనారోగ్య, మరణాల ముప్పు 10 శాతం ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అలాగే, ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య అల్పాహారం తీసుకునే వారిలో ఈ ప్రమాదం 19 శాతానికి పెరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

మరీ ముఖ్యంగా, మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత మొదటి భోజనం లేదా టిఫిన్ చేసే వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని సర్వే తేల్చింది. ఇలా ఆలస్యంగా తినే వారిలో గుండె సంబంధిత మరణాల ముప్పు ఏకంగా 46 శాతం ఎక్కువగా ఉంటుందని రీసెర్చర్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ అలవాటు వల్ల మనిషి ఆయుష్షు సుమారు 2.5 ఏళ్లు తగ్గుతుందని అంచనా వేశారు. కాబట్టి, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షు జీవితం కోసం ఉదయం 8 గంటలలోపే అల్పాహారం ముగించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు