వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. వైఎస్ జగన్ నివాసం ఉంటున్న బెంగళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైఎస్ షర్మిలకు చుక్కెదురైంది. ప్యాలెస్‌లోకి షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ప్రవేశించకూడదంటూ న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ, కుటుంబ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో షర్మిల శనివారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసే బాధ్యతలో భాగంగా ప్యాలెస్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 19కు వాయిదా వేశారు.
అసలు వివాదం ఏంటి?
యలహంక ప్యాలెస్‌కు సంబంధించిన వివాదంలో సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున భీమిశెట్టి రమేష్‌బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సంస్థలో వైఎస్ భారతి గతంలో డైరెక్టర్‌గా పనిచేశారని, 2017 ఫిబ్రవరి 16 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రమేష్‌బాబుతో కలిసి ‘భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్ఎల్పీ’లోనూ ఆమె డైరెక్టర్‌గా ఉన్నట్లు వివరించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది సుధీర్ మేడమ్మయ్య కోర్టులో వాదనలు వినిపిస్తూ.. వైఎస్ భారతి తల్లి ఇ.సి. సుగుణమ్మ 2007 మార్చి 1న యలహంక ప్యాలెస్‌ను తమ సంస్థకు 20 ఏళ్ల కాలపరిమితితో లీజుకు ఇచ్చారని తెలిపారు. ఈ లీజు 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్యాలెస్ ప్రాంగణంలో పండ్ల తోటలు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాల అభివృద్ధి కోసం సంస్థ భారీ మొత్తంలో ఖర్చు చేసిందని కోర్టుకు వివరించారు.
అయితే, 2026 ఆగస్టు 27న సుగుణమ్మ తన కుమార్తె వైఎస్ భారతి, మనుమరాళ్ల పేరిట గిఫ్ట్ డీడ్ రాసిచ్చినట్లు న్యాయవాది తన వాదనల్లో ప్రస్తావించారు.
షర్మిలపై పిటిషనర్ ఆరోపణలు
గతంలో యలహంక ప్యాలెస్‌లోని గెస్ట్‌హౌస్‌లో తాత్కాలికంగా నివసించేందుకు షర్మిల అనుమతి తీసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అలంకరణ పనుల పేరుతో బయటి వ్యక్తులను ప్యాలెస్‌లోకి పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల అక్కడి నిర్మాణాలు, విలువైన పండ్ల చెట్లకు నష్టం కలిగే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇరుపక్షాల వాదనలు, పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం.. యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ప్రవేశించకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలులో భాగంగానే బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్ 19న జరగనున్న తదుపరి విచారణలో ఈ వివాదంపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది.
also read: బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న నా విజ్ఞప్తిని ప్రజలు స్వీకరించడం సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ
