భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్న చాహల్.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరినట్లు సమాచారం. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు కీలక బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా చాహల్‌కు స్థానం కల్పించారు.
బీజేపీలో తనకు అవకాశం కల్పించినందుకు చాహల్ సోషల్ మీడియా వేదికగా పార్టీ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. బీజేపీ కుటుంబంలో తనకు గౌరవప్రదమైన స్థానం కల్పించారని పేర్కొన్నాడు.
క్రికెట్లో తనదైన ముద్ర వేసిన చాహల్.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో విజయాలను అందుకున్నాడు. 2016 నుంచి 2024 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, 72 వన్డేలు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 121 వికెట్లు, టీ20ల్లో 96 వికెట్లు సాధించాడు. అంతేకాకుండా టీ20 క్రికెట్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి భారత బౌలర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఆడిన చాహల్.. 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టులోకి చేరాడు. అతడిని ఆ ఫ్రాంచైజీ రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఇదిలా ఉండగా, చాహల్‌తో పాటు అసోం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు కూడా బీజేపీ ఓబీసీ మోర్చాలో వివిధ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. క్రికెట్లో సత్తా చాటిన చాహల్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
also read: మృత్యువులా దూసుకొచ్చిన లారీ.. ఒకే కుటుంబాలకు చెందిన ఏడుగురు బలి
