తమిళనాడులో పెళ్లైన మరుసటి రోజే ఓ నవవధువు మృతశిశువుకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. పెళ్లికి ముందే ఆమె ఏడు నెలల గర్భవతి అనే విషయాన్ని దాచిపెట్టి తనకు వివాహం జరిపించారని వరుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లాలోని పాళయంగోట్టయ్ సమీపంలో నివసించే వెంకటేశ్ (25)కు, తాళయూత్తు ప్రాంతానికి చెందిన పిచ్చమ్మాళ్తో ఈ నెల 15న వివాహం జరిగింది. వివాహం అనంతరం నూతన వధువు భర్త ఇంటికి చేరుకుంది. అయితే పెళ్లైన మరుసటి రోజే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉదయం పిచ్చమ్మాళ్కు తీవ్రమైన కడుపునొప్పితో పాటు రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు వెంకటేశ్ ఇంట్లోని స్నానాల గదిలో ఓ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. పరిశీలించగా, ఏడు నెలలకే జన్మించిన ఆడ శిశువు మృతదేహంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై వరుడు వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు పెళ్లి చేసే సమయంలో పిచ్చమ్మాళ్ ఏడు నెలల గర్భవతి అన్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించాడు. ఈ విషయం ముందే తెలిసి ఉంటే వివాహం చేసుకునేవాడిని కాదని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
వరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పిచ్చమ్మాళ్పై నమ్మకద్రోహం, గర్భస్రావానికి కారణమవ్వడం తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.
అయితే శిశువు మృతికి అసలు కారణం ఏమిటి? ఈ ఘటనలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే శిశువు మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
also read: ఇఫీలో ‘భక్త కన్నప్ప’కు అరుదైన గౌరవం.. భావోద్వేగ పోస్ట్ చేసిన ప్రభాస్!
