బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తన నెట్‌వర్త్ రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఉంటుందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ ప్రచారంలో పేర్కొంటున్న మొత్తంలో కనీసం 10 శాతం సంపద కూడా తన వద్ద లేదని స్పష్టం చేశారు. తన ఆర్థిక పరిస్థితి గురించి బయట జరుగుతున్న ప్రచారానికి, వాస్తవ పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉందని వెల్లడించారు.
ఇటీవల ‘ది అన్ఫిల్టర్డ్ అవర్’ అనే యూట్యూబ్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ భారతీ ప్రధాన్‌తో మాట్లాడిన అనుపమ్ ఖేర్.. తన సంపాదన, ఆస్తులు, వ్యక్తిగత జీవనశైలికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఇంటర్నెట్లో తన ఆస్తుల విలువను చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. తనను కోట్లకు పడగలెత్తిన వ్యక్తిగా చూపిస్తున్నారని, ఆ వార్తలు చూసిన స్నేహితులు సైతం సరదాగా డబ్బులు అడుగుతుంటారని నవ్వుతూ వెల్లడించారు.
పదేళ్లుగా అద్దె ఇంట్లోనే నివాసం
తన జీవనశైలికి సంబంధించి అనుపమ్ ఖేర్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. గత పదేళ్లుగా తాను అద్దె ఇంట్లోనే నివసిస్తున్నట్లు తెలిపారు. సొంత ఇల్లు కొనుగోలు చేయకుండా అద్దె ఇంట్లో ఉండాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత తనకు ఎంతో మానసిక ప్రశాంతత లభించిందని చెప్పారు. ఆస్తుల నిర్వహణ, వాటికి సంబంధించిన బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నానని వివరించారు.
గతంలో తనకు ఒక ఇల్లు ఉండేదని, దానిని బాలీవుడ్ నటి ఆలియా భట్‌కు విక్రయించినట్లు వెల్లడించారు. అలాగే తన తల్లి కోసం సిమ్లాలో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను, తన సోదరుడు ఇద్దరూ అద్దె ఇళ్లలోనే ఉంటూ సంతోషంగా జీవిస్తున్నామని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.
లగ్జరీ జీవనశైలికి మాత్రం దూరం కాదు!
అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పటికీ తన జీవన ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదని అనుపమ్ ఖేర్ తెలిపారు. మంచి రెస్టారెంట్లలో భోజనం చేయడం, ఖరీదైన హోటళ్లలో బస చేయడం తనకు ఇష్టమని చెప్పారు. సొంత ఆస్తులు ఉండటమే గొప్ప జీవితం కాదని, మానసిక ప్రశాంతతతో సంతోషంగా ఉండటమే ముఖ్యమనే అభిప్రాయాన్ని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. అనుపమ్ ఖేర్ నటించిన తదుపరి చిత్రం ‘యే ప్రేమ్ మోల్ లియా’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన ఆస్తులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
also read: అమితాబ్ బచ్చన్ గొప్ప మనసు.. సామాజిక కార్యకర్త సేవలకు రూ.21 లక్షల విరాళం!
