తెలంగాణ జయశంకర్ భూపాలపల్లిలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి రోడ్డు పక్కన పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం గ్రామ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అజ్మీర చందు (30)ను అతని భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ కలిసి ఇంట్లోనే హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి చికెన్‌పల్లి సమీపంలోని రహదారి పక్కన పడేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
రోడ్డు పక్కన మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ సంపత్ రావు, సీఐ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
also read; శ్రీకృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ పరువునష్టం కేసు!
