Homeసినిమాఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!

ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!

తమిళ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనతను అందుకోబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా ఖ్యాతిని చాటుతూ ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. దీంతో ఈ వేదికపై అవార్డును అందించనున్న తొలి భారతీయ నటుడిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు.

న్యూయార్క్‌లో నవంబర్ 23న నిర్వహించనున్న 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకకు విజయ్ సేతుపతికి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో ఆయన అవార్డును ప్రదానం చేయనున్నారు. గతంలో 2016లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో ప్రజెంటర్‌గా పాల్గొన్నారు. అయితే ఇంటర్నేషనల్ ఎమ్మీ వేదికపై ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి నిలవనున్నారు.

భారతీయ కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు, నిర్మాత కవితా గుప్తా కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024లో ప్రముఖ హాస్యనటుడు వీర్ దాస్‌ను ఈ వేడుకకు హోస్ట్‌గా పరిచయం చేయడంలోనూ ఆమె పాత్ర ఉంది.

మరోవైపు విజయ్ సేతుపతి నటనా ప్రయాణంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ ‘మహారాజ’ ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్ కానుంది. 2024లో విడుదలైన ఈ చిత్రం భారతదేశంతో పాటు చైనాలోనూ మంచి వసూళ్లను సాధించింది. చైనాలో ఈ సినిమా దాదాపు రూ.91.65 కోట్ల కలెక్షన్లు రాబట్టి ప్రేక్షకుల ఆదరణ పొందింది.

ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ సినిమా రీమేక్ హక్కుల కోసం తమను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం వెల్లడించారు. ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడితో ఈ ప్రాజెక్టును ఖరారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ‘మహారాజ’ హాలీవుడ్ రీమేక్‌లో ప్రముఖ నటుడు మాథ్యూ మెకనౌఘే నటించనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాత సుధన్ సుందరం స్పష్టత ఇచ్చారు. నటీనటులకు సంబంధించిన వివరాలను రీమేక్ హక్కులు పొందిన ఏజెన్సీ అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టులో నటించబోయే హాలీవుడ్ స్టార్ ఎవరనే ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం విజయ్ సేతుపతి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘ఇంజి వెల్లం’లో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నారు. ఇలా ఒకవైపు అంతర్జాతీయ అవార్డుల వేదికపై అరుదైన గుర్తింపు.. మరోవైపు తన సినిమాకు హాలీవుడ్ రీమేక్ అవకాశం రావడంతో విజయ్ సేతుపతి పేరు మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

also read: బెంగళూరులో ఘోర మారణకాండ.. భార్యతో సహా అత్తింటి కుటుంబానికి చెందిన ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు