భారతదేశానికి ఒలింపిక్స్లో స్వర్ణ పతకం అందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఓ హాకీ దిగ్గజం ఇంట్లోనే దొంగలు చొరబడ్డారు. కోట్లాది మంది భారతీయులకు గర్వకారణమైన ఒలింపిక్ స్వర్ణ పతకంతో పాటు, ఆయన సాధించిన మరో మూడు అంతర్జాతీయ పతకాలను కూడా అపహరించారు. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఘటన క్రీడా ప్రపంచంలో కలకలం రేపుతోంది.
భారత హాకీ మాజీ ఆటగాడు ఎం.ఎం. సోమయ్య (67) ఇంట్లో ఈ చోరీ జరిగింది. అక్టోబర్ 25న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొడగుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగులు అక్టోబర్ 28 తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. బెంగళూరులోని న్యూ తిప్పసంద్ర, హెచ్ఏఎల్ మూడో స్టేజ్లో ఉన్న సోమయ్య నివాసంలోకి తెల్లవారుజామున 2.34 గంటల సమయంలో ప్రవేశించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి విలువైన వస్తువులను దోచుకెళ్లారు.
ఉదయం 7.15 గంటల సమయంలో సోమయ్య ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగింటి వ్యక్తి ఆయనకు సమాచారం అందించారు. దీంతో ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పొరుగింట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వారిలో ఒకరు నీలం రంగు చొక్కా, మరొకరు ఎరుపు రంగు చొక్కా ధరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దొంగిలించిన పతకాలివే..
ఈ చోరీలో దుండగులు ఎత్తుకెళ్లిన వస్తువుల్లో అత్యంత విలువైనవి సోమయ్య సాధించిన అంతర్జాతీయ పతకాలే. 1980 మాస్కో ఒలింపిక్స్లో భారత్కు లభించిన స్వర్ణ పతకంతో పాటు, 1982 న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన రజత పతకం, 1986 సియోల్ ఆసియా క్రీడల్లో గెలుచుకున్న కాంస్య పతకం, 1982 ఆమ్స్టర్డామ్ ఛాంపియన్స్ ట్రోఫీలో అందుకున్న మరో కాంస్య పతకాన్ని దుండగులు అపహరించారు.
వీటితో పాటు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.30 వేల నగదును కూడా ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన మొత్తం వస్తువుల విలువ సుమారు రూ.3.53 లక్షలుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
ఈ ఘటనపై సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందిరానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాగా, ఎం.ఎం. సోమయ్య భారత హాకీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాడు. 1980, 1984, 1988 ఒలింపిక్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1988 సియోల్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించారు. క్రీడారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1985లో ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును అందుకున్నారు. అలాంటి దిగ్గజ ఆటగాడి ఇంట్లోకి చొరబడి, ఆయన జీవితకాల క్రీడా విజయాలకు గుర్తుగా ఉన్న పతకాలనే దొంగిలించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
also read: హరియాణా పాఠశాల ఘటన.. ఆరేళ్ల బాలికపై దాడి చేసిన ఎనిమిదేళ్ల బాలుడికి బెయిల్!
