భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రానికి బాంబే హైకోర్టులో కీలక ఊరట లభించింది. సినిమా విడుదలకు ముందే పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. చిత్రానికి సంబంధించిన వీడియోలు, పాటలు, ఇతర కంటెంట్‌ను అనధికారికంగా రికార్డు చేయడం, ఆన్లైన్లో ప్రసారం చేయడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంచడంపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. తమ సినిమా కాపీరైట్ హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని భావించిన నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా కథ, స్క్రిప్ట్, పాత్రలు, చిత్రీకరించిన దృశ్యాలు, పాటలు, ఆడియో రికార్డింగ్లపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రత్యేక ఆహ్వానితుల కోసం ప్రదర్శించిన రెండు ట్రైలర్లను కొందరు రహస్యంగా రికార్డు చేసి ఆన్లైన్లో ప్రచారం చేసిన విషయాన్ని కూడా కోర్టుకు వివరించారు.
ఈ సినిమా నిర్మాణానికి భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నట్లు నిర్మాతలు న్యాయస్థానానికి తెలిపారు. మొదటి భాగం కోసం దాదాపు రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, రెండు భాగాల నిర్మాణ వ్యయం కలిపి సుమారు రూ.4,000 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఈ వాదనలను పరిశీలించిన జస్టిస్ మాధవ్ జమ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం.. నిర్మాతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ప్రాథమికంగా బలమైన కారణాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
దీంతో పైరసీకి పాల్పడే గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలపైనా వర్తించేలా ‘డైనమిక్ ఇంజంక్షన్’ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా కంటెంట్‌ను అక్రమంగా ప్రసారం చేసే వెబ్సైట్లు, మిర్రర్ సైట్లు, లింకులను గుర్తించిన వెంటనే వాటిని బ్లాక్ చేయాలని లేదా తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. ఈ ఆదేశాలపై గూగుల్‌తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
వాల్మీకి మహర్షి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు.
కాగా, ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసిన బాంబే హైకోర్టు.. అప్పటివరకు ప్రస్తుత మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి కోర్టు ఆదేశాలు పైరసీ ముప్పును ఎంతవరకు అడ్డుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
also read: ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు షాక్.. రాజకీయ నిరసనల్లో పాల్గొనడంపై తీవ్ర వ్యాఖ్యలు!
