Homeతెలంగాణసికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత

క్రైమ్ మిర్రర్ : నకిలీ కరెన్సీ నోట్ల అక్రమ రవాణాకు రైల్వే పోలీసులు అడ్డుకట్ట వేశారు. జైపూర్ నుంచి ముంబైకి తరలిస్తున్న సుమారు రూ.60 లక్షల విలువైన నకిలీ కరెన్సీని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల శివరతన్ మహియాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ నంబర్ 10పై నిలిచి ఉన్న ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18519) జనరల్ బోగీలో అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న నల్ల బ్యాగును పరిశీలించగా 12 కట్టల్లో భద్రపరిచిన రూ.500 నకిలీ నోట్లు బయటపడ్డాయి. వాటి మొత్తం విలువ రూ.60 లక్షలుగా గుర్తించారు.

విచారణలో ఈ నకిలీ నోట్లను జైపూర్‌కు చెందిన ఓం ప్రకాశ్ (25) తనకు అప్పగించినట్లు శివరతన్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. వాటిని ముంబైకి చేర్చితే రూ.2.20 లక్షలు ఇస్తానని ఆశ చూపడంతో రవాణాకు అంగీకరించినట్లు సమాచారం.

అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్‌లో ఓం ప్రకాశ్ నుంచి బ్యాగును తీసుకున్న శివరతన్, రైలులో కాచిగూడకు చేరుకున్నాడు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చాడు. తొలుత ప్రయాణించాల్సిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంతో మరో రైలులో ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఓం ప్రకాశ్ సూచన మేరకు ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు విచారణలో వెల్లడైంది.

అదే సమయంలో స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ బృందాలు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. నకిలీ కరెన్సీతో పాటు ఐఫోన్ 14, రైలు టికెట్, బ్యాక్‌ప్యాక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న మరో వ్యక్తి ఓం ప్రకాశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ వై. సాయి శేఖర్, డీఎస్ఆర్పీ ఎస్.ఎన్. జావేద్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ బి. సాయేశ్వర్ గౌడ్, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ భవానీ శంకర్ సరస్వత్‌తో పాటు బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది అప్రమత్తతను రైల్వే, రోడ్డు భద్రత విభాగం ఐజీ కె. రమేష్ నాయుడు అభినందించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి తగిన బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు.
also read : 28 ఏళ్ల క్రితం హత్య చేసి పరారీ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు