-
ఎన్నికల పిటిషన్ తేలేవరకు వాయిదా
-
కోర్టుకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
-
అందుకే మరింత జాప్యం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికపై ప్రతిస్తంభన నెలకొంది. ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఎన్నిక చల్లదంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ హైకోర్టులో తేలే వరకు..ఉప ఎన్నిక నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రాజకీయంగా, న్యాయపరంగా సరికొత్త చర్చకు దారితీసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక శాసనసభ లేదా పార్లమెంట్ స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్నది ప్రాథమిక సూత్రం.
అయితే ఎన్నికల పిటిషన్ విచారణలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలను నిలిపి వేయవచ్చా? ఆరు నెలల కాల పరిమితిని మించి ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఈసీకి లేదా? న్యాయస్థానాలకు ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థల విషయంలో కోర్టులు కూడా పెద్దగా జోక్యం చేసుకో అనే విషయాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది.
-
ఆరు నెలల్లో ఎన్నికలు..
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151 ఏ ప్రకారం ఖాళీ ఏర్పడిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక పూర్తి చేయాలి. మిగిలిన పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉన్నప్పుడు లేదా ఎన్నికల నిర్వహణలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికను వాయిదా వేయడానికి మినహాయింపులు ఉన్నాయి.
అయితే రాజ్యాంగం లోని అధికరణ 190 (3), ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 84, 98,101 ప్రకారం పిటిషనర్ కేవలం ఎన్నికను రద్దు చేయడమే కాకుండా.. తననే విజేతగా ప్రకటించాలని కోరితే పరిస్థితి పూర్తిగా మారుతుంది.
గతంలో వేములవాడ అసెంబ్లీ కేసుల వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం.. ఒకవేళ ఒక ఉప ఎన్నిక జరిగి వేరొకరు గెలిస్తే.. ఆ తరువాత అసలు ఎలక్షన్ పిటిషన్ లో న్యాయస్థానం పాత అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తే తలెత్తే రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి.. ఉప ఎన్నికను వాయిదా వేసే విచక్షణాధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.
-
ఇటీవల తమిళనాడులో..
ఇటీవల తమిళనాడులో కూడా ఇటువంటి పరిణామాలు జరిగాయి. అక్కడ ఆరు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం రెండింటికే ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో పాత సాధారణ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి.
వాటిపై తీర్పు వచ్చేవరకు నోటిఫికేషన్ జారీ చేయలేమని మద్రాస్ హైకోర్టు ఎదుట ఈసీ స్పష్టమైన వైఖరిని తీసుకుంది. ఎన్నికల పిటిషన్లు కోర్టు ఇచ్చే తీర్పు ప్రభావం నియోజకవర్గ ప్రాతినిధ్యం పై నేరుగా పడే అవకాశం ఉన్నందున.. ఆరు నెలల సాధారణ గడువును పక్కనపెట్టి ఉప ఎన్నికను హోల్డ్ లో పెట్టడం చట్టబద్ధమేనని న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో తీర్పు ఇచ్చాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం ఖైరతాబాద్ ఉప ఎన్నిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
