Homeఆంధ్ర ప్రదేశ్అందరి దృష్టి పులివెందులపైనే..!

అందరి దృష్టి పులివెందులపైనే..!

  • ఈనెల 5న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన

  • భారీ తాగునీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవం

  • భారీగా ఏర్పాటు చేస్తున్న కూటమి నేతలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావడంతో పాటు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది.

మొన్న ఆ మధ్యన పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరు నేతలు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. పేరుకు ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా.. రాజకీయంగా మాత్రం హీట్ పుట్టించేది. కచ్చితంగా దీనిని పొలిటికల్ అడ్వాంటేజ్ గా ఓటమి ప్రభుత్వం తీసుకోవడం ఖాయం.

  • రూ.480 కోట్లతో భారీ ప్రాజెక్ట్..

పులివెందుల నియోజకవర్గంలో 480 కోట్ల రూపాయలతో భారీ తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. జల్ జీవన్ పథకంలో భాగంగా వైసిపి ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణాన్ని మొదలుపెట్టారు. కానీ సగం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

నిధులు మంజూరు చేయించి పెండింగ్ పనులను పూర్తి చేయగలిగారు. ఈ పథకం ద్వారా ఏడు మండలాల్లోని సుమారు ఐదు లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు అందనుంది. అటువంటి పథకానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రారంభించడం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించనుంది.

పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల పనులకు సైతం శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు కూటమి నేతలు.

  • ఏం మాట్లాడతారనే దానిపై చర్చ..

సాధారణంగా విపక్ష నేత నియోజకవర్గానికి అధికార పాలకులు వెళ్తే అక్కడ సంచలనాలు నమోదు కావడం ఖాయం. ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పులివెందులలో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మూడుసార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండుసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పై ఆ ఇద్దరు నేతలు ఏం మాట్లాడతారు అనేది ఒక చర్చగా ఉంది.

అసెంబ్లీకి స్థానిక ఎమ్మెల్యే రావడంలేదని అంశాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తారు. అసలు జగన్ హయాంలో పులివెందుల అభివృద్ధి ఏం జరిగింది? కూటమి వచ్చిన తర్వాత ఏం చేశాం అనే దానిపై ప్రజలకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

  • ఈ పరిణామాల క్రమంలో..

కడప జిల్లాలో వైయస్ కుటుంబానికి పట్టు తగ్గింది అన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి దారుణమైన దెబ్బ తగిలింది. ఏడాది కిందట పులివెందుల జడ్పిటిసి స్థానానికి జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీకి కనీస స్థాయిలో ఓట్లు రాలేదు. మరోవైపు వివేకానంద రెడ్డి హత్య అంశం వెంటాడుతోంది.

ఇప్పుడు అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ప్రజల మూడ్ మార్చేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో అందరి దృష్టి కడప జిల్లాలోని పులివెందుల పై పడింది. మరోవైపు భారీ బహిరంగ సభ నిర్వహణకు సైతం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు