Homeతెలంగాణహైడ్రాకు ప్రజామోదం...!

హైడ్రాకు ప్రజామోదం…!

  • హైదరాబాద్ నగరంలో చెరువులకు, జలాశయాలకు పునరుజ్జీవం

  • ప్రారంభంలో వ్యతిరేక ప్రచారం

  • క్రమేపీ ప్రజల్లో మారుతున్న అభిప్రాయం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైడ్రా.. ఈ పేరు చెప్పగానే భాగ్యనగరం వాసులు హడలెత్తిపోయేవారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రాను ప్రారంభించారు సీఎం రేవంత్. అదో మానస పుత్రికగా భావించి హైడ్రాను రంగంలోకి దించారు.

బుల్డోజర్లు, కూల్చివేతలతో హల్చల్ చేసింది హైడ్రా. రాజకీయ రగడకు కూడా కారణం అయింది. అయితే దీనిపై ప్రజా వ్యతిరేకత కూడా వచ్చింది. కానీ ఇదంతా ప్రజల కోసమేనని ఇప్పుడిప్పుడే అర్థం కావడం ప్రారంభించింది.

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, న్యాయపరమైన చిక్కులు కారణంగా హైడ్రా తన కార్యాచరణ శైలిని వ్యూహాత్మకంగా మార్చుకుంది. కేవలం ఆక్రమణల కూల్చివేతలకే పరిమితం కాకుండా.. జల వనరులను కాపాడి పునరుద్ధరించడమే అసలు లక్ష్యం అన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది.

  • మిషన్ కాకతీయ గ్రామీణ ప్రాంతాల్లోనే

గతంలో మిషన్ కాకతీయ పేరుతో గ్రామీణ చెరువులపై చూపించిన శ్రద్ధను గులాబీ ప్రభుత్వం నగర పరిధిలోని జలాశయాలపై పెద్దగా చూపించలేదు. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి పరిధిలోని వందలాది చెరువుల్లో గుర్రపు డెక్క, మురుగు పేరుకుపోయింది. కబ్జాలతో చాలా చెరువులు అన్యాక్రాంతం అయ్యాయి.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా చేపట్టిన పునరజ్జీవ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయి. నగరవాసులు హైడ్రా చర్యలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం నగరానికి దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను చేకూరుస్తోంది. బెంగళూరు తరహా పర్యావరణహిత నమూనాను స్వీకరించి.. ప్రత్యేక సాంకేతికతతో పూడికతీత, సహజ సిద్ధ వడపోత పద్ధతులు, సుందరీకరణ పనులను వేగవంతం చేసింది.

ప్రత్యేకించి మేడ్చల్- మల్కాజిగిరి పరిధిలోని చారిత్రక కాప్రా చెరువుతోపాటు పాతబస్తీలోని బమ్రుక్- సుదౌల, అంబర్ పేటలోని బతుకమ్మ కుంట, తుమ్మిడి కుంట, నల్లచెరువు వంటి కీలక జలాశయాలను ఆధునికరించే ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మురుగునీటిని మళ్లించడం, వాకింగ్ ట్రాక్ లు, పార్కులను అభివృద్ధి చేసి ఆక్రమణలకు తావు లేకుండా శాశ్వత రక్షణ గోడలు నిర్మిస్తుండడం గమనార్హం.

  • చుట్టూ వివాదాలు..

హైడ్రా ప్రారంభంలో చాలా రకాల విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అదే తరహా వ్యతిరేక ప్రచారం నడిచింది. బహిరంగ చర్చల్లో కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. మొత్తం ప్రచారం ప్రతికూలంగానే ఉండేది. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్న చెరువుల పునరుద్ధరణ పనులతో హైడ్రా ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పుకొట్టింది.

దశాబ్దాలుగా తీవ్ర దుర్గంధంతో నిండిపోయిన చెరువులకు మళ్లీ జీవం వచ్చింది. దీంతో హైడ్రా చర్యలపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. నెటిజన్లు సైతం ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది ప్రజామోదం కలిగించే బలమైన అస్త్రంగా మారింది.

  • వ్యతిరేకత కామన్..

ఏదైనా ఒక బలమైన వ్యవస్థ వచ్చినప్పుడు దానిపై వ్యతిరేకత అనేది సర్వసాధారణం. సంక్షోభాల సమయంలో నిర్మాణాత్మక పరిష్కారం వైపు అడుగులు వేసే క్రమంలో అడ్డంకులు కూడా వస్తాయి. ఇప్పుడు హైడ్రా కూడా అటువంటి అడ్డంకులను ఎదుర్కొని ప్రజామోదం పొందుతోంది.

నగరంలో ఒకప్పుడు మాయమైపోయిన జలవనరులను పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలాల పెంపుతో పాటు వర్షాకాలంలో ముంపు సమస్యకు శాశ్వత విరుగుడు లభించింది. కూల్చివేతల వంటి తాత్కాలిక సంచలనాల కంటే చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడమే అత్యుత్తమ ప్రజాసేవ అని హైడ్రా నిరూపిస్తోంది.

పారదర్శకతతో ఈ పనులు కొనసాగిస్తూ.. స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచగలిగితే.. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ చరిత్రలో హైడ్రా ఒక విప్లవాత్మకమైన మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు