శ్రీకాకుళం, క్రైమ్ మిర్రర్: శ్రీకాకుళం జిల్లాలో ని నరసన్నపేట మండలం జమ్ము జంక్షన్ సమీపంలో శనివారం ఉదయం ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ప్రయాణీకులు సకాలంలో బస్సు నుంచి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి పలాస వైపు వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు నరసన్నపేట ప్రాంతానికి చేరుకున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో బస్సులో మంటలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.
Also Read:వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుకలు: నవంబర్ 25న ఘనంగా పెళ్లి!
బస్సులో మంటలు మొదలైన విషయాన్ని ఓ వ్యక్తి గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయగా, ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. కొద్ది సమయంలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.అగ్నిప్రమాదం కారణంగా కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.అయితే బస్సులో మంటలు ఎలా చెలరేగాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:భారత ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్: జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన ‘మూడీస్’
