అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గంప సత్యనారాయణ ఏకే-47 తుపాకీతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. స్టేషన్ ప్రాంగణంలోనే తుపాకీతో కాల్చుకోవడంతో ఆయన ఛాతీ భాగంలో బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు.
కాల్పుల శబ్దం వినిపించడంతో పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న సత్యనారాయణను హుటాహుటిన అరకు వ్యాలీ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం నెలకొంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా వివరాలను ఆరా తీశారు. సత్యనారాయణ ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కుటుంబ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా? విధుల ఒత్తిడి కారణమా? అనే కోణాల్లో అధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: అమెరికన్ డైమండ్స్‌తో అలంకరించిన 48 కిలోల బంగారు గణేశుడు..
