గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు కోర్టును ఆశ్రయించింది. కేసులో ఏ-2గా ఉన్న అశోక్ కుమార్, ఏ-7 నిందితుడు వెంకటరాజులను రెండు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసుకు సంబంధించి గతంలో మాజీ సీఐ నాగరాజు ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్ అధికారులు కీలకంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వాంగ్మూలంలో వెల్లడైన అంశాలపై మరింత స్పష్టత కోసం అశోక్ కుమార్, వెంకటరాజులను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ తన పిటిషన్‌లో పేర్కొంది.
ఇప్పటికే దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలను నిందితుల నుంచి సేకరించాల్సిన సమాచారం, ఆధారాలతో సరిపోల్చడంతో పాటు మరికొన్ని కీలక వివరాలను రాబట్టాల్సి ఉందని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ రెండు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని అభ్యర్థించారు.
అయితే సిట్ పిటిషన్‌పై న్యాయస్థానం వెంటనే నిర్ణయం తీసుకోలేదు. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న తర్వాత కస్టడీపై తుది నిర్ణయం తీసుకోనుంది.
కోర్టు నిర్ణయం అనంతరం సిట్ దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. నిందితుల విచారణ ద్వారా కేసులో ఇంకా బయటకు రాని అంశాలు వెలుగులోకి వస్తాయా? దర్యాప్తులో కీలక ఆధారాలు లభిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
also read: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న యువకుడు
