కర్నూలు జిల్లా ఆదోనిలో పారిశుద్ధ్య కార్మికురాలిపై జరిగిన దాడి కలకలం రేపుతోంది. ఆదోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నర్సమ్మ అనే మహిళపై ముగ్గురు మహిళలు, మరో వ్యక్తి కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.
ఈ ఘటనలో నర్సమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరం 70 శాతానికిపైగా కాలిపోవడంతో ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలు కారణం ఇదేనా?
నర్సమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె భర్త శ్రీనివాసులు గతంలో మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలను నర్సమ్మే చూసుకుంటూ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో చిన్నఈరన్న అనే వ్యక్తితో నర్సమ్మకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల చిన్నఈరన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి మృతికి నర్సమ్మే కారణమని చిన్నఈరన్న కుటుంబ సభ్యులు అనుమానించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే నర్సమ్మపై దాడి చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి దాడికి పాల్పడిన వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. నర్సమ్మ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
also read: తొలిరోజే విధ్వంసం.. చీర లాగారంటూ ఎమ్మెల్యే సునీత కన్నీటి పర్యంతం!
