Homeతెలంగాణకోమటిరెడ్డి యూ టర్న్!

కోమటిరెడ్డి యూ టర్న్!

-సీఎం రేవంత్ రెడ్డితో సంధి
-కొండా సురేఖ పై వేటుతో మారిన సీన్
-కనిపించని మునుపటి దూకుడు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భయపడుతున్నారా? కొండా సురేఖ పై చర్యలతో వెనుకడుగు వేశారా?? తొందరపడితే తనపై కూడా వేటు ఖాయం అని అంచనాకు వచ్చారా? అందుకే సీఎం రేవంత్ తో సర్దుబాటుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రధానంగా మంత్రి పదవిపై గురిపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రకాల విన్యాసాలు చేశారు. కానీ ఇప్పుడు కొండా సురేఖ పై వేటు పడడంతో వెనక్కి తగ్గాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

అదే పనిగా విమర్శలు..
ఇటీవల వరకు సీఎం రేవంత్ రెడ్డి పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగా విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొండా సురేఖ ఎపిసోడ్తో పూర్తిగా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు. అబ్బే నేను సీఎంను ఏమీ అనలేదని.. అదంతా తనంటే గిట్టని ఓ మీడియా చేసిందని చెప్పుకొస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డితో తనకు ఇబ్బందులు లేవని వ్యాఖ్యానించారు. ఆయనను బలమైన నాయకుడిగా అభివర్ణించారు. ఆయన వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నారు. అక్కడితో ఆగకుండా మునుగోడు నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇదే రాజగోపాల్ రెడ్డి రెండు నెలల కిందట మునుగోడు నియోజకవర్గం పాకిస్తాన్లో ఉందా? ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్తో రాజగోపాల్ రెడ్డి యూ టర్న్ తీసుకోవడం విశేషం.

జూనియర్ అనే అభిప్రాయం..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం. ఆయనకంటే తానే సీనియర్ అని ప్రూవ్ చేసుకునేందుకు.. బలమైన నాయకుడు అనిపించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి ఒక విషయం మరిచిపోతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలోకి వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. రేవంత్ నేరుగా టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎం అయ్యారు కానీ తాను కోరుకున్న మంత్రిని కాలేకపోయాను అనే బాధ రాజగోపాల్ రెడ్డి లో ఉంది. తనలాంటి వారికి మంత్రి పదవి రాలేదు కానీ.. రేవంత్ కు ఏకంగా ముఖ్యమంత్రి పదవి రావడానికి ఎక్కువగా జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్ సంస్కృతి బట్టి రేవంత్ హై కమాండ్ చేతిలో కీలుబొమ్మ అని భావించారు. ఇప్పుడు రేవంత్ జూలు విధిల్చారు. హై కమాండ్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో ఆయన మంత్రి కొండా సురేఖ పై వేటు వేశారు. చివరకు సీనియర్ నేతైన చిన్నారెడ్డి విషయంలో కూడా వెనక్కి తగ్గలేదు.

పూర్తిగా వెనక్కి తగ్గిన వైనం..
ఈ మొత్తం పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆందోళనకు గురయ్యారు. అందుకే ఆయన వెనక్కి తగినట్లు అర్థం అవుతోంది. తాజాగా ఆయన వ్యాఖ్యలు బట్టి ఇది స్పష్టమవుతోంది. త్వరలో జరగబోయే సీఎం రేవంత్ బహిరంగ సభకు తన నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలతో తరలి వెళ్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం గమనార్హం. నిన్న మొన్నటి వరకు రేవంత్ అంటే అంత ఎత్తుకు ఎగసిపడిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు భయపడినట్టే కనిపిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు