Homeతెలంగాణకౌశిక్ రెడ్డి పదవి క్షేమమేనా?

కౌశిక్ రెడ్డి పదవి క్షేమమేనా?

-ఎథిక్స్ కమిటీ ఎదుటకు హాజరుకాని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి
-ఆరు వారాలపాటు సమయం కావాలని లేఖ
-రాజకీయ, న్యాయపరమైన వ్యూహం అంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ టాపిక్ అవుతున్నారు. తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నోటీసులకు ఆయన సమాధానం చెప్పలేదు. కమిటీ ముందు హాజరు కాలేదు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి కమిటీ ముందుకు హాజరై ప్రత్యక్షంగా లేదా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆయనకు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన కమిటీ ముందుకు హాజరు కాకుండా ఆరు వారాల గడువు కావాలని కోరుతూ లేఖ పంపారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వీడియో ప్రొసీడింగ్స్, ప్రతిపక్ష బెంచీల కెమెరా దృశ్యాలు తమకు అందిస్తేనే సరైన వివరణ ఇవ్వగలనని.. పైగా రాబోయే అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా సమయం సరిపోదు అని తన లేఖలో ప్రస్తావించారు. దీంతో ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది.

సభలో వికృత చేష్టలు..
శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో జరిగిన తీవ్రమైన వాగ్వాదమే ఈ వివాదానికి మూలం. మైనింగ్ తో పాటు ఇతర అంశాలపై విమర్శలు గుప్పిస్తున్న అధికారపక్ష ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై కౌశిక్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనపై వికృత విన్యాసాలు చేస్తూ.. చేతులతో తుపాకీల గురిపెడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. సభలో గౌరవ సభ్యుడిని ఈ రీతిలో భయభ్రాంతులకు గురిచేయడం శాసనసభ మర్యాదలకు, ఎథిక్స్ కు తీవ్ర విరుద్ధమని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని స్పీకర్ ఎథిక్స్ కమిటీకి పంపించారు.

స్పీకర్ కు సిఫారసు
అయితే తాజాగా ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కాలేదు పాడి కౌశిక్ రెడ్డి. తనకు సమయం కావాలని తిరిగి లేఖ పంపడం కూడా మళ్లీ సీరియస్ అంశంగా మారింది. అయితే నేరుగా ఎథిక్స్ కమిటీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం కంటే.. సభా ధిక్కారం, అనుచిత ప్రవర్తన కింద తీవ్రమైన డిసిప్లినరీ యాక్షన్ ను అసెంబ్లీకి సిఫారసు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఎథిక్స్ కమిటీ తుది నివేదిక సమర్పిస్తే.. రాబోయే సమావేశాల్లో ఆయనను దీర్ఘకాలం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

తదుపరి సమావేశంలో..
ఇంకోవైపు ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి గడువు కోరడం వెనుక రాజకీయ, న్యాయపరమైన వ్యూహాలు ఉన్నాయి. త్వరలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వెంటనే కమిటీ ముందు హాజరైతే ఏదైనా కఠిన చర్య, సస్పెన్షన్ విధిస్తే సమావేశాలకు దూరమవ్వాల్సి వస్తుంది. అందుకే వీడియోలు, ఆధారాలు సమర్పించాలని కోరడం ద్వారా సమయాన్ని పొడిగించుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం తదుపరి సమావేశంలో కౌశిక్ రెడ్డి పంపిన లేఖపై ఒక నిర్ణయం తీసుకోనుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు