క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- నగరంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరుపుకునే ఇళ్ల వద్ద హిజ్రాల ఆందోళనలు, బలవంతపు వసూళ్ల వ్యవహారం తీవ్ర రూపం దాలుస్తోంది. ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన వేడుకల వేళ కుటుంబ సభ్యులను, బంధువులను భయాందోళనలకు గురిచేస్తూ భారీగా నగదు గుంజుతున్నారనే ఆరోపణలు నగరంలో మళ్లీ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఒక వివాహ వేడుకలో జరిగిన సంఘటనపై ఓ హైదరాబాదీ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.రూ. 50 వేలు కావాలని డిమాండ్.. ఆపై బెదిరింపులు:
నెటిజన్ తెలిపిన వివరాల ప్రకారం… తమ పొరుగింట్లో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో సుమారు పది మంది హిజ్రాలు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. నూతన దంపతులను ఆశీర్వదించే పేరుతో ఏకంగా రూ. 50,000 ఇవ్వాలని పట్టుబట్టారు. అంత పెద్ద మొత్తం చెల్లించడం సాధ్యం కాదని, గౌరవప్రదంగా రూ. 20,000 ఇస్తామని పెళ్లి పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే దీనికి ఒప్పుకోని హిజ్రాలు తక్షణమే తమ సహచరులకు ఫోన్లు చేసి మరో 10 మందిని అక్కడికి పిలిపించారు.
ఇంటి ముందు ధర్నా.. రూ. 35 వేలు సమర్పించుకున్న కుటుంబం
అదనంగా వచ్చిన వారితో కలిసి పెళ్లి ఇంటి ముఖద్వారం వద్ద కూర్చుని తీవ్ర స్థాయిలో యాగీ చేశారు. అభ్యంతరకర రీతిలో బూతులు తిడుతూ, శాపనార్థాలు పెడుతూ పచ్చని పందిట్లో భయాందోళనలు సృష్టించారు. గత్యంతరం లేక, పరువు పోతుందనే భయంతో ఆ కుటుంబం చివరికి రూ. 35,000 ఇచ్చి వారిని అక్కడ నుంచి పంపించి వేయాల్సి వచ్చింది.
చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి
నగరవ్యాప్తంగా శుభకార్యాలు జరిగే ప్రదేశాలను టార్గెట్ చేసుకుని కొందరు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇవ్వకపోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పోలీసు యంత్రాంగం మరియు రక్షక భటులు ఇటువంటి అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలపై ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి శుభకార్యాల వద్ద ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నియమావళిని అమలు చేయాలని కోరుతున్నారు.
అభిమానులకు గుడ్ న్యూస్…! షూటింగ్‌లకు హాజరుకానున్న రష్మిక మందన..
