హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సు శిరీష దారుణ హత్యకు గురైంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటనను పోలీసులు దర్యాప్తు చేసి హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో బీహార్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన శిరీష తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. సుమారు ఏడు–ఎనిమిది నెలలుగా అక్కడే విధులు నిర్వహిస్తూ, ఆస్పత్రి ప్రాంగణంలోని షెల్టర్ రూమ్‌లో ఉంటోంది.
కిటికీ నుంచి గదిలోకి ప్రవేశం…
Also Read:విశాఖలో విషాదం.. బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఆస్పత్రి ప్రాంగణంలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన సైనావుల్లా/సదావుల్లా అనే వ్యక్తి నర్సు రాకపోకలను గమనించినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రాత్రి ఆమె గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో కిటికీ గ్రిల్ ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు వెల్లడించారు.గదిలోకి ప్రవేశించిన నిందితుడు నర్సుపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొన్ని నివేదికల ప్రకారం ముఖంపై రాడ్‌తో దాడి చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
డ్యూటీకి రాకపోవడంతో వెలుగులోకి…
Also Read: గ్రేటర్ నోయిడాలో విషాదం.. ఆరేళ్ల బాలిక హత్య
శిరీష నిర్ణీత సమయానికి డ్యూటీకి రాకపోవడంతో తోటి సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆమె గది వద్దకు వెళ్లి తలుపు కొట్టినా స్పందన రాకపోవడంతో కిటికీలోంచి చూడగా రక్తపు గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు.
గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్…
Also Read:ఇక సినిమాలే నా ప్రపంచం.. బండ్ల గణేశ్ కీలక ప్రకటన
ఘటనపై పహాడీషరీఫ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించి బీహార్‌కు చెందిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షించినట్లు సమాచారం.శిరీష తండ్రి ఇప్పటికే మరణించగా, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఘటనకు ముందు రాత్రి కూడా శిరీష కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆమెపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
మంత్రి సీతక్క దిగ్భ్రాంతి…
Also Read:యశ్‌పై నెగెటివ్ ప్రచారం.. తల్లి పుష్ప ఘాటు వ్యాఖ్యలు
నర్సు హత్య ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.కాగా, ఆస్పత్రి ప్రాంగణంలోనే నర్సు హత్యకు గురికావడం, భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో పోలీసులు మరిన్ని ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు
