Homeక్రైమ్వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి

వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి

క్రైమ్ మిర్రర్ : హనుమకొండ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ (మంగళపల్లి) శివారులో గురువారం చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామానికి చెందిన ఏలూరి రవీందర్‌రెడ్డి, ఏలూరి వీరారెడ్డి, చిట్టి కిరణ్‌, ఏలూరి రాధా (61) గురువారం హుస్నాబాద్‌ మండలం పోతారంలోని శుభం గార్డెన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు.

వేడుక ముగిసిన అనంతరం నలుగురూ కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. రాంనగర్‌ (మంగళపల్లి) శివారు ప్రాంతానికి చేరుకున్న సమయంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన ముగ్గురిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కారు అదుపుతప్పడానికి కారణమేంటనే విషయాన్ని తెలుసుకునేందుకు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో బొమ్మకల్‌ గ్రామంలో విషాదం నెలకొంది.
also read :నిశ్చితార్థం రద్దు.. యువతి ఆత్మహత్య

తాజావార్తలు