క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్ నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్‌కు ముంబై సెషన్స్ కోర్టులో భారీ ఊరట లభించింది. వారిపై నమోదైన మోసం, నమ్మకద్రోహం ఆరోపణలకు సంబంధించిన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యవహారం క్రిమినల్ నేరం కాదని, ఇరుపక్షాల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివాదమని కోర్టు స్పష్టం చేసింది.
ఒక తెలుగు సినిమా ఆఫర్‌కు సంబంధించిన సుమారు రూ.1.75 కోట్ల లావాదేవీలో తనకు రావాల్సిన రూ.70 లక్షలకు పైగా కమీషన్ చెల్లించకుండా సన్నీ లియోన్, డేనియల్ వెబర్ తనను మోసం చేశారని టాలెంట్ కోఆర్డినేటర్ ఓం ప్రకాశ్ జైన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇదే అంశంపై గతంలో జైన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే 2024 అక్టోబర్‌లో ఆ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దిండోషి అదనపు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా పన్ను ఇన్వాయిస్‌లు, ఒప్పందాలు, ఇతర సంబంధిత పత్రాలను కోర్టు పరిశీలించింది. ఈ పత్రాల ఆధారంగా ఇరుపక్షాల మధ్య జరిగిన లావాదేవీ వాణిజ్య ఒప్పందానికి సంబంధించినదేనని అదనపు సెషన్స్ జడ్జి పీఏ సానే పేర్కొన్నారు.
ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోవడం లేదా చెల్లింపుల విషయంలో వివాదం తలెత్తడం మాత్రమే క్రిమినల్ నేరంగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక వ్యక్తిని మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు చూపించే ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడే ఇలాంటి వ్యవహారానికి క్రిమినల్ కేసు వర్తిస్తుందని పేర్కొంది. ఈ కేసులో అలాంటి నేరపూరిత ఉద్దేశానికి సరైన ఆధారాలు కనిపించలేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఓం ప్రకాశ్ జైన్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సన్నీ లియోన్, డేనియల్ వెబర్‌కు ఈ కేసులో ఊరటనిచ్చింది.
also read : ఫోన్ విషయంలో తండ్రి మందలింపు.. తండ్రి కళ్ల ముందే ఇంటర్ విద్యార్థిని మృతి
