క్రైమ్ మిర్రర్ : మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అక్కాతమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాము ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు అంటూ నిరుద్యోగులను నమ్మించి, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అశోక్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. తృప్తి సింగ్ రాజ్‌పుత్ తనను మధ్యప్రదేశ్ పర్యాటక శాఖలో అదనపు డైరెక్టర్‌గా, ఆమె సోదరుడు సుధాన్షు రాజ్‌పుత్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.
2025 ఏప్రిల్ 7న చందేరికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగాల కోసం నిందితులకు రూ.9.8 లక్షలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా అవసరమైన వ్యక్తిగత పత్రాలను కూడా వారికి అప్పగించారు. అయితే ఎంతకాలం గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అశోక్‌నగర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా సూచనలతో బాధితుల ద్వారా నిందితులతో సంప్రదింపులు కొనసాగించారు. మరికొందరు ఉద్యోగ అభ్యర్థులు ఉన్నారని నమ్మించి వారిని చందేరికి రప్పించేలా చేశారు.ఈ క్రమంలో తృప్తి, సుధాన్షు కారులో చందేరికి చేరుకోగానే పోలీసులు పక్కా ప్రణాళికతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తృప్తి వద్ద ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్లతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను భోపాల్‌లోని వారి రహస్య స్థావరాలకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ మోసాలకు మరికొందరు సహకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తనుజ్ బైశ్య, అంజలి సింగ్ పేర్లను కూడా కేసులో చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ అధికారుల పేరుతో ఇంకా ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
also read : ఇంట్లోనే మోడల్ హత్య.. జిమ్ ట్రైనర్‌పై అనుమానం
