Homeతెలంగాణసొంత అజెండాతో వెళితే వేటు!

సొంత అజెండాతో వెళితే వేటు!

-తెలంగాణ బిజెపి నేతలకు హై కమాండ్ స్ట్రాంగ్ వార్నింగ్
-అందరి పనితీరు తన వద్ద ఉందంటూ నితిన్ నబీన్ హెచ్చరిక
-సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- రాష్ట్ర బిజెపి నేతలకు గట్టి హెచ్చరికలు వచ్చాయా? అందరి జాతకాలు బిజెపి పెద్దలు వద్ద ఉన్నాయా? అందుకే ఢిల్లీ పిలిచి మరి తలంటారా? పనితీరు మార్చుకోమని హెచ్చరికలు జారీ చేశారా? లేకుంటే మార్చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఢిల్లీలో తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆషామాషీగా జరగలేదని.. పార్టీ హై కమాండ్ నేతలకు గట్టి హెచ్చరికలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

విభేదాలపై ఫోకస్..
తెలంగాణ బిజెపిలో విభేదాల పర్వం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని గుర్తించింది పార్టీ హై కమాండ్. అయితే ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గట్టిగానే హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. చెప్పాలనుకున్నది నేరుగా కుండలు బద్దలు కొట్టేసినట్లు ప్రచారం జరుగుతుంది. సాధారణంగా ఎంతో సౌమ్యంగా, శాంతిగా మాట్లాడుతారు నితిన్ నబీన్. అయితే పార్టీ అంతర్గత సమీక్షలు, సమావేశాల్లో మాత్రం తీవ్ర స్వరంతో గట్టి హెచ్చరికలు పంపుతుంటారు. ఇప్పుడు అదే పని చేయడంతో రాష్ట్ర నేతలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయారు.

ఇకనుంచి ప్రతి వారం సమీక్ష..
రాష్ట్రంలో కొంతమంది నేతలు అనుసరిస్తున్న వైఖరిపై హై కమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వర్గాలుగా విడిపోయి క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని పక్కన పెట్టడంపై కూడా అసంతృప్తిగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు, సీట్లు పొందినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ బలపడకపోవడంపై కారణాలేంటి అనే దానిపై అన్వేషించింది హై కమాండ్. ఇటీవల వచ్చిన నివేదికలతో నితిన్ నబీన్ తెలంగాణ బిజెపి నేతలతో ఒక ఆట ఆడుకున్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయం లేకపోతే సహించేది లేదని.. ప్రతివారం ప్రగతి నివేదికలను స్వయంగా పరిశీలిస్తానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే..
బిజెపి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు సొంత అజెండాకు ముందుకు వెళ్ళొద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హై కమాండ్. వర్గ పోరు కనిపించిన మరుక్షణం చర్యలకు ఉపక్రమిస్తామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాత్రి వేళల్లో బస చేస్తూ.. నిరంతరం ప్రజల్లో ఉండాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగతా కార్పొరేషన్లలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని గట్టి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి బలహీనపడుతున్నందున.. అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బిజెపి అన్నట్టు ప్రజల్లోకి వెళ్లాలని జాతీయ నాయకత్వం సూచించింది. మరి చూడాలి ఈ హెచ్చరికలు ఎంతవరకు పని చేస్తాయో?…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు