Homeజాతీయండాబర్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట.. ‘100 శాతం’ క్లెయిమ్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలకు తాత్కాలిక స్టే

డాబర్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట.. ‘100 శాతం’ క్లెయిమ్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలకు తాత్కాలిక స్టే

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియాకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. తమ కొన్ని ఉత్పత్తులపై ‘100 శాతం’ అంటూ చేస్తున్న ప్రచారాలను నిలిపివేయాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది.

ఈ మధ్యంతర ఉత్తర్వులు ఆగస్టు 24 వరకు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణలో ఈ అంశంపై మరింత పరిశీలన జరగనుంది.

డాబర్‌కు వివరణ ఇచ్చే అవకాశం కల్పించకుండానే విక్రయాలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ వాదనల్లో ప్రాథమికంగా అంశాలు ఉన్నాయని గుర్తించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలకు నోటీసులు పంపింది.

అసలు వివాదం ఏమిటంటే?

డాబర్‌కు చెందిన తేనె, నెయ్యి, వంట నూనెలు, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, కొబ్బరినీళ్లు వంటి ఉత్పత్తులపై ఉపయోగిస్తున్న కొన్ని ప్రచార పదాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘100 శాతం నేచురల్‌’, ‘100 శాతం ప్యూర్‌’, ‘100 శాతం ఆర్గానిక్‌’, ‘100 శాతం ప్యూరిటీ గ్యారంటీ’ వంటి పదాలు వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని నియంత్రణ సంస్థ పేర్కొంది.

అలాగే కొన్ని ఉత్పత్తులపై జైవిక్ భారత్ లోగో వినియోగం, ‘ఆర్గానిక్’ అనే క్లెయిమ్‌లపైనా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రశ్నలు లేవనెత్తింది.

డాబర్ వాదన ఇదే..

తమ ఉత్పత్తులను ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్‌లో విక్రయిస్తున్నామని డాబర్ కోర్టుకు తెలిపింది. నిబంధనలకు అనుగుణంగానే లేబుళ్లు, ప్రచార వివరాలు ఉన్నాయని పేర్కొంది.

తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వకుండా నిషేధం విధించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వాదించింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ఎలాంటి ప్రకటనలు చేయలేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో డాబర్ ఉత్పత్తుల విక్రయాలపై కొనసాగుతున్న ఆంక్షలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ అంశంపై తదుపరి విచారణలో తుది నిర్ణయం వెలువడనుంది.

also read: చేనేత పథకాలపై కేటీఆర్ ఫైర్.. నేతన్నలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు