క్రైమ్ మిర్రర్ : పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలో తీవ్ర శోకసంద్రాన్ని నింపిన హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల బస్సు చక్రాల కింద పడి మూడేళ్ల నిరుపేద బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే కన్నుమూసిన కన్నపేగును చూసి ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
పోలీసుల సమాచారం మేరకు.. లంకెలకూరపాడు గ్రామానికి చెందిన సాగరబాబు, రాజకుమారి దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సిద్ధార్థ, నితిన్ అనే ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సిద్ధార్థ ముప్పాళ్లలోని ఒక ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చదువుకుంటున్నాడు. మంగళవారం ఉదయం సిద్ధార్థను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి రాజకుమారి తీసుకెళ్లింది. ఆ సమయంలో తెలియకుండానే చిన్న కుమారుడు నితిన్ (3) కూడా తల్లి వెనుకాలే రోడ్డుపైకి వచ్చాడు.
అయితే రోడ్డు దాటుతున్న చిన్నారిని గమనించని బస్సు డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీశాడు. దీంతో బస్సు వెనుక చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లడంతో నితిన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం గమనించి స్థానికులు అక్కడికి చేరుకునేలోపే భయాందోళనకు గురైన డ్రైవర్ బస్సును విడిచిపెట్టి పారిపోయాడు.
కళ్ల ముందే కుమారుడు ప్రాణాలు విడవడం చూసి ఆ తల్లి షాక్‌కు గురైంది. ‘నితిన్ లేవరా.. ఆడుకుందాం’ అంటూ తల్లిదండ్రులు మృతదేహంపై పడి విలపించిన తీరు గ్రామంలో విచారం నింపింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
also read : తెలంగాణలో ‘భూ’ రాజకీయం… 22-A నుంచి ఎర్రవల్లి వరకు..!
