మార్కాపురం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురైన మహిళా రైతు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
కొమరోలు మండలం రౌతుపల్లె గ్రామానికి చెందిన అవిశినేని లక్ష్మీదేవి (45) రోజువారీ వ్యవసాయ పనులలో భాగంగా తన పొలంలో చిక్కుడుకాయలు కోస్తుండగా అకస్మాత్తుగా పాము కాటుకు గురైంది. కాలు వద్ద పాము కాటు వేయడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైంది.
వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు ఆమెను సమీపంలో ఉన్న నాటు వైద్యుడి వద్దకు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి క్రమంగా విషమించడంతో 108 అంబులెన్స్ ద్వారా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికి లక్ష్మీదేవి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
లక్ష్మీదేవి ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
also read: హైదరాబాద్లో కలకలం: మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
