Homeజాతీయంక్యాబినెట్ విస్తరణకు నో ఛాన్స్!

క్యాబినెట్ విస్తరణకు నో ఛాన్స్!

-కలవర పెడుతున్న కర్ణాటక రాజకీయాలు
-వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి
-తాత్కాలికంగా పక్కన పెట్టిన వైనం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:- కర్ణాటక కాంగ్రెస్ లో విభేదాలు వెలుగుచూసాయి. పదవులు పోయిన సీనియర్ మంత్రులు పార్టీకి రాజీనామా చేయడంతో సంక్షోభం తలెత్తింది. నష్ట నివారణ కోసం డీకే శివకుమార్ శ్రమిస్తున్నారు. అసంతృప్తి తుఫానును చల్లార్చెందుకు నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ల తాయిలాలు అంటూ పెద్ద కసరత్తు చేస్తున్నారు. అయితే ఇది ఒక విధంగా తెలంగాణ సీఎం రేవంత్ కు గుణపాఠం. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. కర్ణాటకను ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది.

కర్ణాటకలో తిరుగుబాటు..
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు జరిగింది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ వచ్చారు. అయితే క్యాబినెట్లో 20 మందిని తీసుకున్నారు. కానీ పదవులు దక్కని సీనియర్లు రాజీనామా బాట పట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డీకే శివకుమార్ శ్రమిస్తున్నారు. అయితే కర్ణాటకలో పరిస్థితి వేరు. అక్కడ ముఖ్యమంత్రి మారడంతోనే కొత్త టీమును ఎంపిక చేశారు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు లేదు. కేవలం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భక్తితో పాటు కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. ఇది అత్యంత సాహసమైన పని. ఎందుకంటే అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. క్యాబినెట్లో ఒక్క పదవి మాత్రమే ఖాళీగా ఉంది. ఆ ఒక్క దానికోసం ఉమ్మడి జిల్లాల వారీగా సామాజిక సమీకరణల ప్రాతిపదికన డజన్ల కొద్ది ఆశావహులు పోటీ పడుతున్నారు. దీనిని భర్తీ చేయడం కత్తి మీద సాము.

తప్పకుండా అసంతృప్తి..
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కొంతమంది మంత్రులను తొలగిస్తారు అన్న ఊహాగానాలు ఉన్నాయి. అదే జరిగితే ఊహించని రాజకీయ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉంది. పదవులు కోల్పోయిన మంత్రులు ఊరికే ఉండరు. తప్పకుండా అసంతృప్తితో రగిలిపోతారు. పోనీ ఒకటి రెండు పదవులు భర్తీ చేసినా.. మిగతా పదుల సంఖ్యలో సీనియర్లు అసంతృప్తికి గురవుతారు. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే అభద్రతా భావానికి లోనవుతారు. అసమ్మతి పెరిగి పరోక్షంగా పార్టీలో క్రమశిక్షణకు చేటు కలగక మానదు.

రేవంత్ అప్రమత్తం..
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన పరిణామాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. అనవసరంగా క్యాబినెట్ విస్తరణ జోలికి పోకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. విస్తరణకు వెళ్లిన మరుక్షణం పార్టీలో విభేదాలు తలెత్తడం ఖాయం. పెద్ద ఎత్తున అసంతృప్తి జ్వాల ఎగసిపడడం తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడున్న ఖాళీలను భర్తీ చేయకపోతే వచ్చే నష్టం కంటే.. భర్తీ చేసి పార్టీలో అంతర్గత పోరును కొనితెచ్చుకుంటే జరిగే నష్టమే ఎక్కువ. అందుకే తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ పర్వం తాత్కాలికంగా మూలన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు