వ్యాపార ప్రపంచంలో గుర్తింపు పొందిన నవీన్ అన్సల్ తన జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన దశల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు తీవ్ర మద్యపాన వ్యసనంలో చిక్కుకున్న ఆయన.. ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారో ఓ పాడ్కాస్ట్ వేదికగా పంచుకున్నారు.
ఐశ్వర్య వివేక్ నిర్వహించిన పాడ్కాస్ట్లో పాల్గొన్న నవీన్ అన్సల్.. సంపన్న కుటుంబంలో పుట్టినా వ్యసనం తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించారు. కుటుంబ వాతావరణంలో మద్యం సాధారణ విషయంగా ఉండేదని, అయితే ఆ అలవాటు క్రమంగా తన జీవితాన్ని నాశనం చేసే స్థాయికి చేరిందని చెప్పారు.
తన విలాసవంతమైన జీవనశైలి కోసం వారసత్వంగా వచ్చిన ఆస్తులను కూడా కోల్పోయినట్లు ఆయన తెలిపారు. ఒకప్పుడు ఎన్నో తరాలకు సరిపడా ఆస్తులు ఉన్నప్పటికీ.. తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్నేళ్లలోనే వాటిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
1991లో 33 ఏళ్ల వయసులో తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని నవీన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన జీవితం ముగిసిపోయిందని భావించినప్పటికీ.. అదే తనలో మార్పుకు కారణమైందని తెలిపారు.
వ్యసనం నుంచి బయటపడటానికి ముందుగా నిజాన్ని అంగీకరించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. సమస్యను దాచిపెట్టకుండా సహాయం కోరినప్పుడే మార్పు సాధ్యమవుతుందని సూచించారు.
తాను ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి తిరిగి సాధారణ జీవితానికి రావడం తనకు కొత్త అవకాశం లాంటిదని నవీన్ అన్సల్ చెప్పారు. వ్యసనంతో బాధపడుతున్న ఎవరైనా సరే సరైన సహాయం తీసుకుంటే తిరిగి జీవితాన్ని నిర్మించుకోవచ్చని ఆయన సందేశం ఇచ్చారు.
also read: ఆన్లైన్ గేమ్ మోజు: తండ్రి ఖాతా నుంచి రూ.42 వేల ఖర్చు చేసిన 8వ తరగతి బాలుడు
