Homeజాతీయంగుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం – బాణాసంచా యూనిట్‌లో పేలుడు, 10 మంది మృతి

గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం – బాణాసంచా యూనిట్‌లో పేలుడు, 10 మంది మృతి

గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని రామోల్ ప్రాంతంలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

స్థానికుల సమాచారం మేరకు, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో సమీప ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి అవసరమైన లైసెన్స్ లేకపోవడంతో, గతంలోనే మార్చి 31న అధికారులచే సీజ్ చేయబడింది. అయితే నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా యూనిట్‌ను మళ్లీ ప్రారంభించి బాణాసంచా తయారీ చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

also read: కర్ణాటకలో విషాదం: భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య

తాజావార్తలు