HomeజాతీయంNitin Gadkari: ఈ20 పెట్రోల్ పై అపోహలు వద్దు.. మంత్రి గడ్కరీ క్లారిటీ!

Nitin Gadkari: ఈ20 పెట్రోల్ పై అపోహలు వద్దు.. మంత్రి గడ్కరీ క్లారిటీ!

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 ఇంధన విధానాన్ని మరోసారి సమర్థించారు. వాహనాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నింటికీ ఈ20నే కారణం అని నిందించడం సరికాదని స్పష్టం చేశారు. తాజాగా యూట్యూబర్ సౌరవ్ జోషీ  తన మెర్సిడెస్ బెంజ్ కారులో ఈ20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజీ తగ్గిందని కామెంట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయి నెట్టింట తీవ్ర చర్చ జరిగింది. అయితే, తర్వాత మెర్సిడెస్ బెంజ్ ఇండియా సంస్థ స్పందించి, తమ బీఎస్-6 ప్రమాణాల ప్రకారం తయారు చేసిన కార్లు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమని తెలిపింది. దీంతో సౌరవ్ జోషీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ20 విధానం దేశానికి చాలా మంచిదని, పర్యావరణాన్ని కాపాడే మార్గమని చెప్పారు. ‘‘ప్రజలకు నిజాలు తెలుసు. మేము ఈ విధానాన్ని ప్రతి దశలో ప్రజలతో పంచుకుంటున్నాం’’ అని అన్నారు. ఇంధన రంగంలో విదేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ20 అంటే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం. దీని వల్ల పెట్రోల్ దిగుమతులు తగ్గి, రైతులకు మంచి ధర వస్తుందని, కాలుష్యం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు వాహనాల్లో మైలేజీ తగ్గుతోందని, ఇంజిన్ సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి సమస్యలను ఈ20 మీదకు మాత్రమే నెట్టేయకుండా, వాహన తయారీదారులు, యాజమాన్యాలు కూడా బాధ్యత వహించాలని గడ్కరీ సూచించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 ఇంధనం అందుబాటులోకి వస్తోంది. ప్రభుత్వం దీన్ని క్రమంగా మరింత విస్తరించాలని యోచిస్తోంది. గడ్కరీ మాట్లాడుతూ, దీర్ఘకాలిక లక్ష్యాలతో తీసుకున్న నిర్ణయాలను తక్కువ సమయంలో తీర్పు చెప్పకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు