టీనేజ్ అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఏర్పడే పరస్పర అంగీకారం ఉన్న ప్రేమ సంబంధాలను అణచివేయడానికి తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని తప్పుగా వాడుతున్నారని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ మహదేవన్ తో కూడిన బెంచ్ ఈ అంశాన్ని సుమోటో కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘15 నుంచి 18 ఏళ్ల వయసు అనేది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని, ప్రయోగాలు చేయాలని ఉండే వయసు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడి కలిసి ఉండాలనుకుంటే దాన్ని ఎలా ఆపగలం?’’ అని ప్రశ్నించింది.
పోక్సో చట్టం చిన్నారులపై లైంగిక వేధింపులు, దోపిడీలను నివారించడం కోసం తెచ్చిన చట్టమని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు, దీన్ని తల్లిదండ్రులు తప్పుగా ఉపయోగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. టీనేజ్ అమ్మాయిలు తమ ఇష్టపడిన వ్యక్తితో కలిసి పారిపోతే, కుటుంబ గౌరవం కాపాడుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పోక్సో కేసు నమోదు చేస్తున్నారని గమనించింది. ఒకే స్కూల్, కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల మధ్య ఆకర్షణ ఏర్పడడం సహజం. కానీ, అలాంటి సంబంధాలను నేరంగా చూపించి, అబ్బాయిలను జైలు పాలు చేస్తున్నారని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా జరిగినప్పుడు ఆ అబ్బాయి జీవితం పూర్తిగా నాశనమవుతోంది. అదే సమయంలో అమ్మాయిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ‘బాధితురాలు’గా చిత్రీకరించడం వల్ల ఆమె మనసు కూడా తీవ్రంగా గాయపడుతోంది.
పరస్పరం ఇష్టంతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలను నేరంగా మార్చడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం యొక్క నిజమైన ఉద్దేశ్యం రక్షణ కాబట్టి, దాన్ని తప్పుడు కారణాలతో ఉపయోగించకూడదని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు యువత, తల్లిదండ్రులు, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న అవగాహన లోపాలను ఎత్తి చూపినట్లు అయ్యింది.