క్రైం మిర్రర్ : కాపు సంక్షేమ ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబుతో ఫోన్లో మాట్లాడిన జగన్, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో అందించిన సేవలను జగన్ గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం ఆయన ఎన్నో దశాబ్దాల పాటు చేసిన ఉద్యమాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆయన సేవలు రాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.
ముద్రగడ మరణం ప్రజా జీవితానికి తీరని లోటని పేర్కొన్న జగన్, ఆయన కుటుంబ సభ్యులకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే సమయంలో ముద్రగడ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ప్రజాసేవలను స్మరించుకున్నారు.
also read :కొడిమ్యాలలో దారుణ హత్య.. వృద్ధుడి ప్రాణాలు తీసిన దుండగుడు