సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ మరోసారి పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ పూర్తిగా మద్దతు నిలిపివేసే వరకు ఈ ఒప్పందాన్ని అమలు చేయబోమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికలపై పాక్ చేస్తున్న వ్యాఖ్యలు, ఒత్తిళ్లు లేదా బెదిరింపులు తమ నిర్ణయాన్ని మార్చలేవని కేంద్రం తేల్చి చెప్పింది.
ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. సరిహద్దు ఉగ్రవాదం కొనసాగుతున్నంత కాలం భారత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదని అన్నారు. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాతే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయించిందని గుర్తుచేశారు. ఉగ్రవాదానికి పూర్తిగా ముగింపు పలికిన తర్వాత మాత్రమే ఈ అంశంపై తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పారు.
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు నది, దాని ఉపనదుల జలాల వినియోగానికి సంబంధించిన ఈ ఒప్పందం కుదిరింది. దాదాపు తొమ్మిదేళ్ల చర్చల అనంతరం రెండు దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. అయితే, ప్రస్తుతం మారిన పరిస్థితులు, సరిహద్దు ఉగ్రవాదం కారణంగా ఈ ఒప్పందంపై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది.
ఇటీవల పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని వ్యాఖ్యానించగా, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఒప్పందం పునరుద్ధరించకపోతే అణు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
మరోవైపు, ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత దాని కింద భారత్‌కు ఎలాంటి బాధ్యతలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే, ఈ నిర్ణయాన్ని ఏ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థ కూడా ప్రశ్నించలేదని పేర్కొంది. ఇదే సమయంలో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ ఖండించింది. ఆ దాడుల్లో పౌరులు మరణించడం బాధాకరమని పేర్కొంటూ, అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారానికి తమ మద్దతు కొనసాగుతుందని వెల్లడించింది.