మహారాష్ట్రలోని పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరగడానికి సుమారు అరగంట ముందు నిందితురాలు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరీతో ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ, కాల్ డీటెయిల్ రికార్డ్స్ (CDR) పరిశీలనలో ఈ సమాచారం బయటపడినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల దృష్టిలో ఈ ఫోన్ కాల్ కేసులో కీలకమైన డిజిటల్ ఆధారంగా మారింది. ఆ సమయంలో తాను కేతన్ తో ఎక్కడ ఉన్నానో సియా తన ప్రియుడికి చెప్పి ఉండొచ్చని, అక్కడ ఇతరులు ఎవరూ లేరని కూడా వివరించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ కాల్ హత్యకు ముందే పక్కా ప్రణాళిక అమలులో ఉందనే అనుమానాలకు బలం చేకూర్చిందని భావిస్తున్నారు.
దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. గత మూడు నెలలుగా సియా, చేతన్ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పంపుకున్న సందేశాలు, వాయిస్ కాల్స్ కు సంబంధించిన వివరాలను తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డేటాను సైబర్ నిపుణుల సహాయంతో తిరిగి సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాగే తొలగించిన సమాచారం, లొకేషన్ వివరాలు, ఐపీ అడ్రస్ లను పరిశీలిస్తూ హత్య కుట్రకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, కేతన్ అగర్వాల్, సియా గోయల్‌కు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే ఈ పెళ్లి తనకు ఇష్టం లేకపోవడంతో సియా ముందుగానే హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట జూన్ 14న లోహగడ్ కోట వద్ద కేతన్ ను కొండపై నుంచి తోసేందుకు ప్రయత్నించగా, అతడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ ఘటనను పాము కనిపించడంతో జరిగిన ప్రమాదంగా సియా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
మొదటి ప్రయత్నం విఫలమైన తర్వాత జూన్ 18న మరోసారి పక్కా ప్రణాళికతో కేతన్‌ను కొండపై నుంచి తోసి హత్య చేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో సియా ప్రియుడు చేతన్ చౌదరీ కూడా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి ఫోన్లలో లభించిన డిజిటల్ ఆధారాల ఆధారంగా కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.