ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. గోరఖ్‌పూర్ జిల్లాలో కేవలం 9 నెలల వయసున్న చిన్నారిపై జరిగిన అమానుష ఘటన స్థానికులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కుటుంబ సభ్యుల మధ్యనే భద్రత ఉంటుందని భావించే పరిస్థితుల్లో, బంధుత్వాన్ని మరిచిపోయిన ఓ మైనర్ బాలుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 20 తెల్లవారుజామున 9 నెలల చిన్నారి తన తల్లి పక్కనే నిద్రిస్తుండగా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఉదయం నిద్రలేచిన తల్లి పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే బంధువులు, గ్రామస్తుల సహాయంతో గ్రామమంతా గాలింపు చర్యలు చేపట్టారు. గంటలపాటు సాగిన అన్వేషణ అనంతరం ఇంటికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక పొలంలోని రేకుల షెడ్డులో చిన్నారి అపస్మారక స్థితిలో కనిపించింది. తీవ్ర గాయాలతో పాటు రక్తస్రావం అవుతున్న పరిస్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించినట్లు సమాచారం.
ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోరఖ్‌పూర్ అదనపు పోలీసు అధికారి పాటిల్ నిమిష్ దశరథ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి బాధిత చిన్నారికి దూరపు బంధుత్వంలో మేనమామ వరస అయ్యే 14 ఏళ్ల మైనర్ బాలుడిగా గుర్తించారు. ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చిన అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయడంతో విచారణను మరింత వేగవంతం చేశారు. ఘటన అనంతరం తనపై అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి కోసం వెతుకుతున్నట్లు నటించినట్లు పోలీసులు తెలిపారు.
కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న దర్యాప్తు బృందం సీసీటీవీ దృశ్యాలు, స్థానికుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించింది. ఈ క్రమంలో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరానికి సంబంధించిన విషయాలను అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని, అదే సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి విచారణను కొనసాగిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచిన అనంతరం బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ALSO READ: బీపీ, షుగర్ రోగులకు డెంగ్యూ సోకితే డేంజరా?.. అసలు నిజమిదే!