క్రైమ్ మిర్రర్, సెంట్రల్ బ్యూరో : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా తన రాజకీయ భావజాలాన్ని భవిష్యత్తు కార్యాచరణలను స్పష్టంగా వెల్లడించారు. ద్రవిడ రాజకీయాల మూల పురుషుడిగా పేరుగాంచిన పెరియార్ ఏవి రామస్వామి సిద్ధాంతాలపై తనకున్న స్పష్టమైన వ్యూహాన్ని విజయ్ వెల్లడించారు. పెరియార్ ప్రతిపాదించిన సామాజిక సమానత్వ సూత్రాలను తాము పూర్తిగా నమ్ముతున్నామన్న ఆయన.. అయితే ఆయనకున్న నాస్తిక భావాలను, మత తిరస్కరణను మాత్రం తమ పార్టీ అంగీకరించబోదని విజయ్ తేల్చి చెప్పారు. తాము దైవ విశ్వాసులమని, సమాజంలో ఎవరి సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదని స్పష్టతనిచ్చారు.
తమ ప్రభుత్వం కేవలం ఒకరి ఆలోచనలకే పరిమితం కాకుండా ఉంటుందని, పెరియార్, డాక్టర్ బి.ఆర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి కే కామరాజు వంటి మహోన్నత నేతల ఆదర్శాల సమ్మేళనంతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అంబేద్కర్ అందించిన సమాన అవకాశాలు, సామాజిక న్యాయాన్ని ఉనికి పుచ్చుకుంటూనే, కామరాజ్ అందించిన అవినీతి రహిత నిజాయితీతో కూడిన పరిపాలన నమూనాను తమ ప్రభుత్వానికి మార్గదర్శకంగా తీసుకున్నట్లు సీఎం విజయ్ వెల్లడించారు. 2026 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగి ఏకంగా 35 శాతం ఓట్ల షేర్ తోపాటు 1.72 కోట్ల మంది ఓట్లను సాధించి ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా అవతరించడం వల్లే తాము ఇప్పుడు ప్రభుత్వంలో కూర్చున్నామని గర్వంగా ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో కుల, మతాల అడ్డుగోడలను బద్దలు కొట్టి ప్రజలు తమను ఆదరించారన్న ఆయన.. అందుకే తమ పాలనను గతంలో అన్నాదురై, ఎంజి రామచంద్రన్ అందించిన సాధారణ, అత్యంత సాధారణ ప్రజల ప్రభుత్వాలతో పోల్చారు. ఇప్పుడు విజయ్ నేత్రుత్వంలో నడుస్తున్న అట్టడుగు వర్గాల అత్యంత సామాన్యుల ప్రభుత్వం తమది అని సీఎం విజయ్ సగర్వంగా ప్రకటించారు. సినిమా రంగం నుంచి వచ్చిన తమను కేవలం ఒక నటుడి పార్టీగానే చూస్తూ విమర్శించిన వారికి విజయ్ అసెంబ్లీ సాక్షిగా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా చాలామంది మొదట రాజకీయ పార్టీ పెట్టి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తారని, కానీ తాము మాత్రం ముందుగా ప్రజల్లోకి వెళ్లి వారి నాడి తెలుసుకున్న తరువాతే పార్టీని స్థాపించిన విషయాన్ని ఈ సందర్భంగా విజయ గుర్తు చేశారు. ఈ వ్యత్యాసాన్ని గ్రహించలేని వారే తమపై చులకనగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై తొలిసారి స్పందన..
విజయ్ పార్టీ పెట్టిన తొలినాళ్లలో నిర్వహించిన ఒక సభలో 41 మంది ప్రమాదవశాత్తు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు విజయ్ అధికారికంగా స్పందించలేదు. తాజాగా అసెంబ్లీ వేదికగానే సీఎం విజయ్ స్పందించారు. ప్రమాదవశాత్తు 41 మంది ప్రాణాలను కోల్పోతే దానికి కూడా తమపైనే నిందలు వేయడం ఏ రకమైన రాజకీయమని విజయ ప్రశ్నించారు. తమ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు ప్రత్యర్థులు రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులకు, సైదాంతిక శత్రువులకు మధ్య ఉన్న తేడాను తమ పార్టీ స్పష్టంగా గుర్తిస్తోందని వెల్లడించారు. ఇదే సమయంలో గత డీఎంకే ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో సీఎం విజయ్ విరుచుకుపడ్డారు.
గత పాలనలో పార్టీ ఫండ్ పేరుతో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విజయ్ ఆరోపించారు. లెఫ్ట్ పార్టీల గురించి సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ పార్టీలు తమ కూటమిలోకి ఎవరి దయ దాక్షిణ్యాల వల్ల, బలవంతం వల్ల రాలేదని, స్వచ్ఛందంగానే చేరాయని సీఎం విజయ్ స్పష్టం చేశారు. అయితే కొందరు లెఫ్ట్ నాయకులు మాట్లాడుతున్న కొన్ని మాటలు తనకు అర్థం కావడం లేదంటూ విజయ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. గత ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపడంతో పాటు వారి విధానాలను కూడా అసెంబ్లీ వేదికగా తూర్పు ఆరబట్టినట్టు అయింది. అలాగే కమ్యూనిస్టులకు తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం ద్వారా వారిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు అర్థమవుతోందని పలువురు పేర్కొంటున్నారు. సీఎం విజయ్ డి ఎం కి పార్టీపై చేసిన విమర్శలను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.