- వచ్చే నెలలో రాజకీయ సంచలనమే
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముంగిటకు రానుందా? నియోజకవర్గాల పునర్విభజన బిల్లు సైతం ప్రవేశపెట్టనున్నారా? అందుకు తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ బిల్లును మరోసారి తెచ్చి ఆమోదించుకోవాలని తెరవెనుక కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు డి లిమిటేషన్ బిల్లుకు సంబంధించి సీట్ల పెంపు లాంటి కీలక అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ.. సరికొత్త ముసాయిదాతో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ సీట్లను ఏకంగా 50% పెంచే ఆలోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఈ రెండు బిల్లులు పార్లమెంటులో పాస్ కావడం ఖాయమని తేలిపోయింది.
వీగిపోయిన బిల్లు..
ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంతో అది వీగిపోయింది. అయితే తమిళనాడు, బెంగాల్ ఎన్నికల తర్వాత విపక్షాల బలం తగ్గింది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మరింత పకడ్బందీగా 133వ రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా సీట్ల పునర్విభజన సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలకు చెక్ పెట్టేలా ఈ కొత్త ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్థానాల పెంపు వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని 1971 జనాభా లెక్కల ఆధారంగానే కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో ఒక రాష్ట్రం పరిధిలో నియోజకవర్గాల సరిహద్దుల మార్పునకు మాత్రం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోబోతోంది.
పకడ్బందీగా అడుగులు..
అయితే ఒకసారి లోక్సభ లో వీగిపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి షాక్ తగిలినట్లు అయింది. అందుకే ఈసారి పగడ్బందీగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వీలైనంతవరకు దేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని చూస్తోంది. మరోవైపు బెంగాల్లో మారిన రాజకీయ పరిస్థితులు ఎన్డీఏకు వరంగా మారాయి. అక్కడ టీఎంసీ పార్లమెంటరీ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యింది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు ఒక ప్రత్యేక శిబిరం గా ఏర్పడి ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నారు. మహారాష్ట్రలో శివసేన ఎంపీలు సైతం ఎండీఏ గూటికి చేరారు. తమిళనాడులో స్టాలిన్ మనసు కూడా మారుతోంది. ఒడిస్సాలో కూడా ఎన్డీఏ మరింత బలపడుతోంది. అందుకే ఈ రెండు బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టిగానే కసరత్తు చేస్తోంది. లోక్ సభలో సంఖ్యాబలం తగినంతగా దక్కుతుందని భావించిన మరుక్షణం ఈ రెండు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి వ్యూహంతో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే జూలైలోనే ఈ కీలక పరిణామం జరగనున్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే దేశ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదు అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..