క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : అవార్డులు, సత్కారాలు బువ్వ పెట్టవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రముఖ కళాకారుడు కిన్నెర మొగులయ్య. పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న ఆయన ఇప్పుడు తనకు ప్రభుత్వం కేటాయించిన భూమి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. 12మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలు ఇచ్చి.. ప్రముఖ కళాకారుడుగా గుర్తింపు సాధించి.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు మొగిలయ్య. అతని జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మార్చినా.. ఆయన జీవితం మాత్రం మారడం లేదు. ఆయన గోడును పట్టించుకున్న వారు కూడా లేరు. పద్మశ్రీ అవార్డు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సత్కరించి.. అందించిన 600 గజాల ఇంటి స్థలం కోసం ఆయన పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అయినా సరే ఆయనకు ఫలితం లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
కోర్టుల చుట్టూ తిరుగుతూ..
గత రెండేళ్లుగా ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమికి పట్టా దక్కక.. కుటుంబ సభ్యుల నుంచి ఎదురయ్యే అవమానాలు భరించలేకపోతున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత రెండేళ్లుగా భూమి పట్టా కోసం కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకపోయిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తనకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తుర్కయాంజల్ పరిధిలోని కంట్లూరులో 600 గజాల నివాస స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ నివాస స్థలానికి సంబంధించి జీవో కాపీ అందించారు మొగలియ్యకు. అయితే ఆ భూమిపై ఎవరో కోర్టుకు వెళ్లడంతో వివాదం నడుస్తోంది. దీంతో మొగలయ్య కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే తిరిగి తిరిగి వేసారి పోయానని.. కుటుంబ సభ్యులు సైతం పద్మశ్రీ అవార్డులు కడుపు నింపవని నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాస్పద భూమి కావడంతో కోర్టు ఫీజులు కూడా భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొగిలయ్య.
ఆర్డీవో కార్యాలయంలో మొర..
తనకు ప్రభుత్వం అందించిన భూమిని స్వాధీన పరచాలని కోరుతూ సోమవారం ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో విన్నవించారు మొగలయ్య. అయితే ఆయన సమస్యను ఆర్డిఓ అనంతరెడ్డి విన్నారు. న్యాయవాదిని పెట్టి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు హయత్ నగర్ తహసిల్దార్ ను కలవడంతో ఆమె సైతం ధైర్యం చెప్పారు. కానీ పట్టా మాత్రం కాలేదు మొగిలయ్యకు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆ పట్టా భూమిని తన నలుగురు పిల్లలకు పంచి ఇవ్వాలని ఉందని.. పట్టా కాకపోవడంతో ఇంట్లో పిల్లలు, కోడళ్ళు తిడుతున్నారని.. నీ పద్మశ్రీ ఏంది? నీ పేరు ఏంది? అని అనుమానిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మొగిలయ్య కోరుతున్నారు.