- ప్రజా గాయకుడితో ఆగస్టీన్ తో కలిసిన ఫోటో తో పోస్ట్
- తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ప్రజా గాయకుడు గద్దర్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పనవసరం లేదు. గతంలో పలు సందర్భాల్లో గద్దర్ చెప్పుకొచ్చారు. మొన్ననే తెలంగాణ పరిణామాలతో పవన్ సైతం గద్దర్ పై తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టారు. దీనిపై తెలంగాణ వాదులతో పాటు గద్దర్ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఓ పాత ఫోటోతో సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంశం గురించి చర్చించే సమయంలో ప్రజా గాయకుడు గద్దర్, అగస్టీన్ తో దిగిన ఫోటో అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తాను ట్వీట్ చేసిన ఈ ఫోటో గురించి చాలా మందికి ఆసక్తి ఉందని.. ఈ ఫోటో, తెలంగాణ ఉద్యమం, సామాజిక తెలంగాణ ఆలోచన చుట్టూ జరిగిన లోతైన సంభాషణలకు సంబంధించిన ఒకప్పటి జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ఆ రోజుల్లో బహుజన ఆలోచన, సామాజిక న్యాయం, అన్నగారిన వర్గాల రాజకీయ సాధికారత అనే అంశాలపై చర్చలు జరిగేవి అని గుర్తు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నీ ఇప్పుడు గుర్తు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
అప్పటి ఫోటో ఇది..
ప్రజారాజ్యం పార్టీ సమయంలో.. పవన్ కళ్యాణ్ తన తండ్రి కొణిదల వెంకట్రావు మరణానంతరం గద్దర్ తో పాటు అగస్టీన్ ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్న ఫోటోగా గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక మార్పు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని రాజకీయ శక్తిగా మార్చాలని ఆకాంక్షలతో అప్పట్లో ఈ సంభాషణలు సాగాయని గుర్తు చేసుకున్నారు. ఈ ఫోటో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు. ఇటీవల తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వరుసగా ఈ ట్వీట్లు చేస్తున్నారు. తెలంగాణ పై తన స్టాండ్ ఏంటో అందరికంటే ముందే చెప్పానంటూ ఓ పాత వీడియోను ట్రీట్ చేసిన సంగతి తెలిసిందే. 2009లో తాను ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే గద్దర్తో కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సభలో పాల్గొన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. తాను అప్పట్లోనే సామాజిక తెలంగాణ కోసం పిలుపునిచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు పవన్.
మరోసారి టార్గెట్ తప్పదా..
అయితే ఇప్పుడు ఇద్దరు తెలంగాణ ప్రముఖులతో తన అనుబంధాన్ని గుర్తు చేయడం ద్వారా మరోసారి పవన్ కళ్యాణ్ ను తెలంగాణ వాదులు టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. మొన్ననే గద్దర్ కుమార్తె పవన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు కవితతో పాటు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు అదే పనిగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. పవన్ జనసేన తెలంగాణలో విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన టార్గెట్ అవుతున్నారు. అయినా సరే పవన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కళాకారులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై తెలంగాణ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.